బ్రిస్బేన్: కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్... బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ తరఫున ఆడిన క్లార్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేశాడు.
రెండు ఓవర్లు స్పిన్ వేయడంతో పాటు చాలాసేపు స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు. 47 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. క్లార్క్ ఫిట్‌నెస్‌ను సెలక్టర్ రోడ్నీ మార్ష్, కోచ్ లీమన్‌లు పర్యవేక్షించారు. తన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ వరల్డ్‌కప్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌కు ఇంకా దూరంలో ఉన్నానని చెప్పాడు. క్లార్క్.. శుక్రవారం అడిలైడ్‌లో ఆసీస్ జట్టుతో కలవనున్నాడు.