
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మద్దతుగా నిలిచాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ధోని ఫామ్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో హస్సీ స్పందించాడు. ధోని సరిగ్గా ఆడలేకపోయింది రెండు మ్యాచ్‌లే కదా.. దీనికి అతడిపై అంతగా విమర్శలు గుప్పించడం సరి కాదంటూ హస్పీ పేర్కొన్నాడు. ధోని ఫామ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు హస్సీ మాట్లాడుతూ... ‘ ఇంగ్లండ్ పర్యటనలో ధోని రెండు ఇన్నింగ్స్‌లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. ధోని ఏంటో, ఎలా ఆడతాడో మన అందరికీ తెలుసు. మధ్యలో కొన్ని సార్లు ఏ ఆటగాడైనా గాడి తప్పుతాడు. ఇది అందరికీ జరిగేదే. ధోని తప్పక తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడు.
ఎన్నో ఏళ్ల పాటు అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లు సరిగా ఆడలేదన్న కారణంగా అతడు అందించిన విజయాలను మరిచిపోతే ఎలా. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు అతడి సేవలు భారత జట్టుకు ఎంతో అవసరం. వికెట్ల వెనుక నిల్చుని బౌలర్లకు ధోని ఇచ్చే సలహాలు ఎంతో అమూల్యమైనవి. ధోని ఒక చాంపియన్ అన్న విషయం మరవద్దు’ అని హస్సీ విజ్ఞప్తి చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు హస్సీ బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. అంతకుముందు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ హస్సీ ఆడాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌కు హస్సీ ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment