
శిఖరాన మిథాలీ రాజ్
⇒వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు
⇒6 వేల పరుగులు పూర్తి
బ్రిస్టల్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించింది. 183 వన్డేల్లో ఆమె 6,028 పరుగులు సాధించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఇంత కాలం ఉన్న 5,992 పరుగుల రికార్డును మిథాలీ బద్దలు కొట్టింది. ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు సాధించగా, మిథాలీకి 164 ఇన్నింగ్స్‌లు మాత్రమే సరిపోయాయి. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా కూడా ఈ హైదరాబాదీ గుర్తింపు తెచ్చుకుంది. లెగ్ స్పిన్నర్ కిర్‌స్టన్ బీమ్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఆమె ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 35 ఏళ్ల మిథాలీ రాజ్ 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 106 మ్యాచ్‌లలో ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భారత్‌కే చెందిన జులన్ గోస్వామి (189) పేరిట రికార్డు ఉండగా, ఇప్పుడు బ్యాట్స్‌మన్ జాబితాలో కూడా భారతీయురాలే అగ్రస్థానానికి చేరింది.
ప్రశంసల వెల్లువ...
⇒ ‘భారత క్రికెట్‌లో అద్భుత ఘట్టం. మిథాలీ చాంపియన్‌లా ఆడింది’ – విరాట్ కోహ్లి, భారత పురుషుల జట్టు కెప్టెన్
⇒ ‘మిథాలీకి అభినందనలు, ఇది చాలా పెద్ద ఘనత’ – సచిన్
⇒ ‘పదేళ్ల వయసు నుంచి ఆమె పురోగతిని చూశాను. మిథాలీ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ఇలాంటివి మరిన్ని సాధించాలి’–వీవీఎస్ లక్ష్మణ్
⇒‘ఇది మహిళల క్రికెట్‌కు సుదినం. మిథాలీ, జులన్ రికార్డులు మన జట్టు స్థాయి పెరిగిందనేదానికి సంకేతం’ –డయానా ఎడుల్జీ
⇒మొత్తం 183 వన్డేల్లో మిథాలీ రాజ్ 51.52 సగటుతో 6,028 పరుగులు చేసింది. ఇందులో 5 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు ఉన్నాయి.