మిథాలీరాజ్ ఫైల్ ఫోటో ( ఇన్ సెట్ లో తల్లి లీలారాజ్ )
సాక్షి, హైదరాబాద్ : మిథాలీకి అప్పుడు ఎనిమిదిన్నరేళ్లు. చిన్నప్పుడు ఎంతో బద్ధకస్తురాలు. బద్ధకాన్ని పోగొట్టేందుకు అన్నయ్య వెంట ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్‌కు పంపించేవారు తల్లిందండ్రులు. ప్రాక్టీస్ ముగిసినాక కోచ్ జ్యోతిప్రసాద్ ఆఖరులో రెండు మూడు బాల్స్ వేసి మిథాలీరాజ్‌తో కూడా ఆడిపించేవారు. ఆ రెండు, మూడు బాల్స్ వేసినప్పుడు మిథాలీ ఆడిన ఆటకు జ్యోతిప్రసాద్ మంత్రముగ్ధుయ్యారు. మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీల్‌రాజ్‌లను పిలిచి మీ అమ్మాయిలో చాలా ప్రతిభ ఉందన్నారు. దీంతో ఆమె చదివే కిమ్స్ హైస్కూల్లో రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేలా మిథాలీని సిద్దం చేశారు. మూడు నెలలకు కిమ్స్ స్కూల్ కోచ్ సంపత్‌కుమార్ నాయుడు ‘మీ అమ్మాయిని ఇండియా తరపున ఆడిస్తా’ అన్నారు. ఆ మాట విన్న దొరైరాజ్, లీలారాజ్ నవ్వుకున్నారు. అసలు క్రికెట్ అంటే తెలియని మిథాలీని ఇండియాకి ఎలా ఆడిస్తారంటూ కోచ్‌ను ప్రశ్నించారు. కానీ ఆ రోజు కోచ్ మాటతో వదిలేయడంతోనే ఈరోజు మహిళా క్రికెట్ అంటే మిథాలీ.. మిథాలీ అంటే మహిళా క్రికెట్ అనే పేరు తెచ్చిపెట్టింది.
కానీ మిథాలీరాజ్ చిన్నప్పుడు ప్రాక్టీస్‌కు వెళ్తున్నప్పుడు రక్తసంబంధీకులు, బంధువులు చాలా హేళనగా మాట్లాడేవారని ఆమె తల్లి లీలారాజ్ చెప్పారు. ‘మీకేం పనిలేదా ఆడపిల్లకు ఆటలు ఎందుకు.. ఆమెకేమైనా దెబ్బ తగిలితే పెళ్లి ఎవడు చేసుకుంటాడు’ అని తన అత్త విసుక్కునేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎందరు ఎన్ని మాటలన్నా.. కూతురును ఓ మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాం. మహిళలకే ఆదర్శంగా తీర్చిదిద్దాం. మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీరాజ్ తల్లి లీలారాజ్ ఏమంటున్నారంటే.. మిథాలీ క్రికెట్‌లో బాగా రాణిస్తోంది. 9 ఏళ్లకే సబ్‌జూనియర్స్‌కి సెలెక్ట్ అయ్యింది. అప్పుడు ఢిల్లీకి ఎలా పంపాలి అని చాలా బాధపడ్డాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి వెళ్లి మిథాలీ ట్రైన్ ఎక్కేవరకు ఉన్నాం. ఇంటికి వచ్చాక ఏడుస్తూ ఉన్నాను. నా బాధను గమనించిన నా భర్త దొరై ‘దేశానికి మన కూతురిని ఇచ్చాం. నువ్వు కూల్‌గా ఉండు. మిథాలీని అలా పంపడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు నెక్ట్స్ కాజీపేట స్టేషన్‌లో ట్రైన్ ఆగుతుంది వెళ్లి తీసుకొచ్చేస్తా’ అన్నారు. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని ఇంకోసారి నేను ఇలా ఏడ్వను, బాధ పడను అని మాట ఇచ్చాను. అక్కడ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిథాలీ ఎంతో ఆనందంగా హైదరాబాద్‌కు వచ్చింది. ఇక ప్రాక్టీస్ విషయంలో చాలా ఏకాగ్రత పెట్టాలి. దొరై ఆంధ్ర బ్యాంక్‌లో పనిచేస్తున్నారు, నేను సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో చేస్తున్నాను. మిథాలీని ప్రాక్టీస్‌కి తీసుకెళ్లడం కష్టంగా ఉందని.. ఆమె ఆహారం, ప్రాక్టీస్, తదితర విషయాల్లో దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నేను నా ఉద్యోగాన్ని వదిలేశా.
ఎందుకిలా చేస్తున్నారు..?
మిథాలీని క్రికెట్‌కు దగ్గర చేసి బంధువులకు దూరం చేశాం. దీంతో మా ఉమ్మడి కుటుంబంలో చాలా మంది మిథాలీకి తెలియదు. చాలాసార్లు మా అమ్మ, బంధువులు ‘ఎందుకిలా చేస్తున్నారు’ అంటూ మొహంపైనే అనేవారు. కానీ.. మాకు తెలుసు మా కూతురి స్టామినా ఏంటో. ఎవరెన్ని మాట్లాడినా మేం ఏం పట్టించుకోలేదు. మా పని మేం చేసుకుంటూ.. ఆటపై దృష్టి సారించమని ఆమెను ప్రోత్సహించాం.
ఇప్పుడు గర్వంగా ఉంది
క్రికెట్‌లో ఆమె వరల్డ్ రికార్డు సాధించనప్పుడు మా అత్తమామల వైపు వారు, ఆ కుటుంబం వైపు వారు చాలా సంతోషించి, మాకు ఫోన్‌లు చేసి అభినందించారు. ఇప్పుడు మహిళా క్రికెట్‌కు నా కూతురు ద్వారా గుర్తింపు రావడాన్ని చూసి తల్లిగా నేనెంతో గర్విస్తున్నా. ఒక ఆడపిల్ల తల్లిగా నాకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.
Comments
Please login to add a commentAdd a comment