
మిథాలీ బృందానికి రూ.50 లక్షల నజరానా
భోపాల్: భారత మహిళల క్రికెట్ జట్టుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. త్వరలోనే భారీ ఎత్తున జరిపే కార్యక్రమంలో ఈ రివార్డును అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారత మహిళల జట్టును సన్మానించనుంది. అలాగే జట్టుకు రూ.50 లక్షల నజరానా అందిస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
భారత మహిళల జట్టుకు బీసీసీఐ సన్మానం
న్యూఢిల్లీ: అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇంకా తేదీ, వేదిక ఎక్కడ అనేది ఖరారు కాలేదు. బుధవారం నుంచి క్రీడాకారిణులు విడతల వారీగా స్వదేశానికి రానున్నారు. ఇదే కార్యక్రమంలో ఒక్కో సభ్యురాలికి రూ.50 లక్షల చొప్పున, సహాయక సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున బోర్డు అందించనుంది.
‘మన జట్టు ఫైనల్లో ఓడినా కోట్లాది మంది భారత హృదయాలను గెలుచుకుంది. త్వరలోనే వారిని సన్మానించనున్నాం. అలాగే ప్రధాని మోదీతో కూడా సమావేశం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇక వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌పై జట్టు దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు ఈ క్రేజ్‌ను మహిళల ఐపీఎల్‌తో సొమ్మ చేసుకునే అవకాశాలూ లేకపోలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.