తప్పుగా అర్థం చేసుకోకండి : పీవీ సింధూ
తనను వాలీబాల్ ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించిన ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను పీవీ సింధూ వెనకేసుకొచ్చారు. తాను వాలీ బాల్ ప్లేయర్ అని చెప్పడం ఎమ్మెల్యే సర్ ఉద్దేశం కాదని సింధూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్టేజీ పైనే ఉన్న తన తండ్రిని ఉద్దేశించి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అన్నారని, ముంతాజ్ అహ్మద్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోకండి అని తెలిపారు.
చార్మినార్లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించిన విషయం తెలిసిందే. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ సీఎం చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు.
అయితే ముంతాజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్‌లు సంధిస్తున్నారు. ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్తో ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను పోల్చుతున్నారు. ఒలింపిక్స్లో మెడల్ తీసుకువచ్చిన పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారని నెటిజన్లు సదరు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Here MLA sir doesn't mean that I am a volleyball player.He has expressed my dad's presence on the stage as national volleyball player.(1/2) pic.twitter.com/akm27Hxri6
— Pvsindhu (@Pvsindhu1) February 19, 2017