
ఆ ఓటమిని మర్చిపోండి
టీమిండియా మహిళా జట్టుకు మోదీ సూచన
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను దక్కించుకోలేదేమో కానీ వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుందని ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారు తనని కలిసినప్పుడు ఫైనల్ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగమని సూచించినట్టు చెప్పారు. ‘మీరు ప్రపంచకప్‌లో విజేతలుగా నిలవలేకపోయామనే ఆలోచనను మనస్సులోంచి తుడిచేయండి. కప్‌ను గెలిచారా లేదా అనేది అప్రస్తుతం. కానీ భారతీయుల మనస్సులను గెలిచారు. వారు నన్ను కలిసినప్పుడు అందరి ముఖాల్లో కాస్త నిరాశ, ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించింది.
నేను వారికి ఒకటే చెప్పాను. ఇది మీడియా యుగం. విపరీతమైన అంచనాలతో బరిలోకి దిగి ఫలితం రాకపోతే ఇలా నిరాశ, బాధ అలుముకుంటాయి. అయితే తొలిసారిగా వారి ఓటమిని కోట్లాది మంది దేశ ప్రజలు తమదిగా తీసుకుని వారి బరువును తగ్గించారు. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగండి’ అని ప్రధాని పేర్కొన్నారు.