
లండన్: ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ.. ఆ తర్వాత టెస్టుల్లో కనిపించలేదు. యాషెస్ తొలి టెస్టులో మొయిన్ అలీ విఫలమైన నేపథ్యంలో అతన్ని తదుపరి టెస్టు మ్యాచ్‌కు తప్పించారు. ఆపై మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లండ్ క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు మొయిన్ అవసరం అనిపించలేదు. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన టెస్టు జట్టులో కూడా మొయిన్ అలీని పక్కన పెట్టేశారు. దాంతో మొయిన్ అలీ టెస్టు కథ ముగిసిందనే చర్చ నడిచింది. టెస్టు క్రికెట్‌కు మొయిన్ అలీ వీడ్కోలు చెప్పాడనే వార్తలు వచ్చాయి.
దీనిపై ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ వివరణ ఇస్తూ.. తాము కావాలని మొయిన్‌కు ఉద్వాసన చెప్పలేదన్నాడు. ‘ టెస్టు క్రికెట్ నుంచి విరామం ఇమ్మని మొయిన్ మాకు విజ్ఞప్తి చేశాడు. అంతే తప్ప ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటించలేదు. సాధారణ బ్రేక్ మాత్రమే మొయిన్‌కు ఇచ్చాం. నేను కేవలం మొయిన్ గురించే ఈ విషయం చెప్పడం లేదు. మాకు సమ్మర్ అంతా చాలెంజ్‌గా గడిచింది. వరల్డ్‌కప్, యాషెస్‌లతో మా క్రికెటర్లు తీవ్రంగా అలసిపోయారు. దానిలో భాగంగానే పలువురి విశ్రాంతి ఇస్తున్నాం’ అని గైల్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment