
అమ్మకు తీవ్ర అస్వస్థత.. క్రికెటర్ ఆందోళన
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ మూడో వన్డేకు పాకిస్తాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ దూరం కానున్నాడు.
అబుధాబి: వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ మూడో వన్డేకు పాకిస్తాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ దూరం కానున్నాడు. తన తల్లికి తీవ్ర ఆనారోగ్యంగా ఉందన్న వార్త తెలియగానే ఆమిర్ పాక్ కు బయలుదేరాడని పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం ఆమిర్ తల్లి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో బుధవారం వెస్టిండీస్ తో జరగనున్న చివరిదైన మూడో వన్డేకు అతడు దూరం అవుతున్నాడు. ఆమిర్ స్థానంలో రహత్ అలీ, సోహైల్ ఖాన్ లలో ఒకరికి మూడో వన్డేలో ఆడే అవకాశం దక్కనుంది.
ఈ సిరీస్ లో రెండు వన్డేల్లో కలిపి పాక్ పేసర్ ఆమీర్ రెండు వికెట్లు తీశాడు. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ రెండు వన్డేల్లోనూ విజృంభించి సెంచరీలు చేయడంతో మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రమైన మూడో వన్డే బుధవారం అబుదాభిలో జరగనుంది. పరిస్థితులు చక్కబడితే.. అక్టోబర్ 13నుంచి మొదలుకానున్ను టెస్ట్ సిరీస్ సమయానికి ఆమిర్ జట్టులో చేరే అవకాశం ఉందని బోర్డు సభ్యులు చెప్పారు.