షమీపై కోహ్లి మొగ్గు
రాంచీ:ఆస్ట్రేలియాతో చివరిదైన నాల్గో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ తిరిగి తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా సోమవారం తమిళనాడుతో జరిగిన తుది పోరులో బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించిన షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటుకున్నాడు.
దాంతో ఆసీస్ తో జరిగే తుది టెస్టులో షమీని జట్టులో చేర్చాలని టీమిండియా కెప్టెన్ కోహ్లి భావిస్తున్నాడు. ఇప్పటికే చివరి టెస్టు మ్యాచ్ కు జట్టు ఎంపిక కావడంతో షమీని ప్రాబబుల్స్ లో చేర్చే అవకాశం ఉంది. ఆ టెస్టు మ్యాచ్ భారత్ కు కీలకం కావడంతో షమీ తుది జట్టులో ఉంటే బౌలింగ్ బలం పెరుగుతుంది.
'తుది జట్టులో షమీ ఉంటే బౌలింగ్ మరింత పటిష్టంగా ఉంటుంది. దీనిపై సెలక్టర్లకు నేనేమీ చెప్పలేదు. అతని ఎంపికకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం' అని కోహ్లి తెలిపాడు.ఒకవేళ షమీకి తుది జట్టులో ఆడే అవకాశం కల్పిస్తే మాత్రం ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ల్లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.