అది వన్డేలాడే పిచ్లా ఉందా?
లార్డ్స్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మూడో వన్డే పిచ్పై ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఇది వన్డేలాడే పిచ్లా ఉందా అంటూ పిచ్ ను రూపొందించిన క్యూరేటర్లపై అసహనం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ కు దిగి 30 బంతుల్లో 20 పరుగులిచ్చి ఆరు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ సాధారణ స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది.
అనంతరం మాట్లాడిన మోర్గాన్.. వన్డే మ్యాచ్ కు ఒక పేలవమైన పిచ్ రూపొందించడాన్ని తప్పుబట్టాడు. ' ఇది వన్డేలాడే పిచ్లా ఎంతమాత్రం లేదు. ఇది ఏ జట్టుకు మంచిది కాదు. ఈ తరహా పిచ్ పై ఎవరు ముందుగా బ్యాటింగ్ చేసినా కష్టాలు తప్పవు. ఇంతటి పేలవమైన పిచ్ ను ఎందుకు రూపొందించినట్లు. పిచ్ పై గడ్డి ఎక్కువగా ఉండటంతో పేసర్లకు స్వర్గధామంలా మారింది. సహజసిద్ధమైన గేమ్ ను ఆడటం కూడా కష్టంగా మారిపోయింది'అని మోర్గాన్ విమర్శించాడు.మరొకవైపు తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తిరిగి తేరుకున్న తీరును మోర్గాన్ అభినందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన విధానం ఆకట్టుకుందన్నాడు.