ధోని మరో మైలురాయి
రాజ్కోట్: భారత క్రికెట్లో తనదైన ముద్రవేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మూడు వేల పరుగుల మార్కును చేరిన ఆటగాళ్ల జాబితాలో ధోని స్థానం సంపాదించాడు. ఐపీఎల్-9లో భాగంగా గురువారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్బంగా ధోని 10 బంతుల్లో 22 పరుగులు చేశాడు. తద్వారా మూడు వేల పరుగుల మార్కును చేరిన ఏడో ఆటగాడిగా ధోని(3,010) గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకూ 131 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోని.. 117 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను సాధించాడు.
అంతకుముందు ఈ జాబితాలో సురేష్ రైనా(3,743), రోహిత్ శర్మ(3,476), గౌతం గంభీర్(3,235), విరాట్ కోహ్లి(3,212), క్రిస్ గేల్( 3,200), రాబిన్ ఉతప్ప(3,039)లు ఉన్నారు. కాగా యావరేజ్లో మాత్రం ధోని(సుమారు 40.00) రెండో స్థానంలో ఉండగా, గేల్ (47.62) తొలిస్థానంలో నిలిచాడు. మరోవైపు నిన్నటి మ్యాచ్ లో సురేష్ రైనాను ధోని స్టంపింగ్ చేసి దినేష్ కార్తీక్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం 24 స్టంపింగ్ లతో సమంగా ఉన్నారు.