న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాతే తన భవిష్యత్‌పై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని అతని సన్నిహిత మిత్రుడొకరు నిర్ధారించాడు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌కు సంబంధించిన పుకార్లను ఆపివేయాలని అతను కోరాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత ధోని భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని ఎంపికపై సెలక్టర్లు కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. ‘ఐపీఎల్ తర్వాతే ధోని తన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వస్తాడు. అతనిలాంటి పెద్ద ఆటగాడి గురించి చర్చ జరగడం సహజం.
ఫిట్‌నెస్‌పరంగా ప్రస్తుతం ధోని అత్యుత్తమ స్థితిలో ఉన్నాడు. గత నెల రోజులుగా కఠోర సాధన కూడా చేస్తున్నాడు. అయితే ఐపీఎల్‌లోగా అతను ఎన్ని అధికారిక మ్యాచ్‌లు ఆడతాడనేది మున్ముందు తెలుస్తుంది’ అని ధోని స్నేహితుడు వెల్లడించాడు. మరోవైపు ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగానే ధోని 2020 టి20 ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా లేదా అనేది తేలుతుందని హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ధోని ఫామ్‌తో పాటు ఇతర వికెట్ కీపర్లతో పోలిస్తే అతని ఆట ఎలా ఉందనేది కూడా అప్పుడు కీలకంగా మారుతుందని ఆయన అన్నారు. ఐపీఎల్ ప్రదర్శన అనంతరం 15 మంది సభ్యుల భారత జట్టు ఎంపిక దాదాపుగా ఖాయమవుతుందని కూడా శాస్త్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment