ఎంఎస్ ధోని
సాక్షి, బెంగళూరు: రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరాయి. ఈ రెండేళ్లలో జరిగిన సీజన్లలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు ఆడాయి. అయితే తాజాగా జరుగుతున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా మాజీ కెప్టెన్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ వినూత్న రీతిలో వేలంలో పాల్గొని ఆటగాళ్లను చేజిక్కించుకుంటోంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో చెన్నై ఫ్రాంచైజీ 30 ఏళ్లకు పైబడ్డ ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకుంది. దీంతో వెటరన్ల ప్రదర్శనతో ధోనీ ఏం చేయబోతున్నాడని చర్చనీయాంశమైంది.
చెన్నై ఫ్రాంచైజీ తీసుకున్న ఆటగాళ్ల వయసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హర్భజన్ సింగ్(37), షేన్ వాట్సన్(36), డ్వేన్ బ్రేవో(34), డుప్లెసిస్(33), కేదార్ జాదవ్(32). అనుభవం ఉన్న ఆటగాళ్లతో ధోనీ జట్టును నడిపించాలని భావిస్తున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. కాగా, డుప్లెసిస్, డ్వేన్ బ్రేవోలు గత సీజన్లలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఓ సిరీస్‌లో వేగంగా పరుగులు చేయని కారణంగా ధోని వయసు ప్రభావం వల్లే ఆటతీరు మారిందని రిటైర్ కావడమే ఉత్తమమంటూ మాజీ క్రికెటర్లు విమర్శించిన విషయం విదితమే. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నంత కాలం ఆటకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించాలన్న ధోని సలహా మేరకు చెన్నై మేనేజ్‌మెంట్ సీనియర్ క్రికెటర్లపై మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment