ధోనిదే ప్రధాన పాత్ర..
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తమ జట్టు తిరిగి గాడిలో పడటం వెనుక మహేంద్ర సింగ్ ధోనిదే ప్రధాన పాత్ర అని రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. చివరి ఐదు మ్యాచ్ ల్లో నాలుగింట విజయం సాధించామంటే అందుకు ధోనినే కారణమని స్మిత్ తెలిపాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నందుకు ధోనికి ధన్యవాదాలు తెలియజేశాడు. 'ధోని బ్యాట్ తో హిట్ చేస్తున్న తీరు బాగుంది. మేము తిరిగి గాడిలో పడటానికి ధోని పలు ఇన్నింగ్స్ ల్లో చేసిన కొన్ని విలువైన పరుగులే కారణం. ధోని తన పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు. రాబోవు సీజన్ లో ధోని మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసేలోపు ధోని బ్యాట్ నుంచి మరిన్ని ఆహ్లాదకర ఇన్నింగ్స్ లు రావడం ఖాయం'అని స్మిత్ తెలిపాడు. కాగా, ఆఫ్ ఫీల్డ్ వివాదాలు ధోనిపై ఏమాత్రం ప్రభావం చూపే అవకాశమే లేదని చెప్పుకొచ్చాడు స్మిత్.
ఐపీఎల్-2017 సీజన్ ఆరంభంలో పుణె యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ధోనీని తొలగించి అతని స్థానంలో స్టీవ్ స్మిత్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో ధోని ఆటగాడిగా పుణె జట్టులో కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ ఆరంభమైన తరువాత ధోనిని ఆర్సీఎస్ యజమాని సోదరుడు హర్ష గోయంకా అవమానపరుస్తూ ట్వీట్ చేశాడు. తానే అడవికి రాజని స్మిత్ నిరూపించుకున్నాడని ఆర్సీఎస్ తొలి మ్యాచ్ గెలిచిన తరువాత గోయంకా వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేగింది. ఈ కామెంట్లపై ధోని ఇప్పటివరకూ ఎటువంటి పెదవి విప్పలేదు. పుణె జట్టులో తనపాత్రను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ మిస్టర్ కూల్ కు సరైన నిర్వచనం చెప్పాడు ధోని.