
ధోని ‘కంగారు’లా...
నాలుగు నెలల పాటు ఆస్ట్రేలియాలో గడిపిన ధోని... మరికొద్ది రోజులు అక్కడే ఉంటే పౌరసత్వం దొరికేదంటూ సరదాకా వ్యాఖ్యానించాడు. ఆసీస్ గడ్డపై అన్ని రోజులు ఉండటం వల్ల అక్కడి కంగారూలు ధోనిని ఆకట్టుకున్నాయో... లేక పిల్లల్ని ఆ జంతువు ఒడిసిపట్టుకునే విధానం నచ్చిందో... ధోని పూర్తిగా కంగారూలను ఫాలో అయిపోతున్నాడు. ఫిబ్రవరి 6న ధోనికి కూతురు పుట్టింది. అప్పటి నుంచి మార్చి నెలాఖరు వరకు కనీసం తన కూతురు జీవాను ధోని చూసుకోలేదు. ఇక భారత్ వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా తన గారాలపట్టిని వదిలి ఉండటం లేదు.
సొంతూరు రాంచీలో... రైనా పెళ్లిలో... కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో... ఇలా ప్రతి చోటా కూతురితోనే కనిపిస్తున్నాడు. అంతే కాదు... కంగారూ తన పొత్తిళ్లలో పిల్లని దాచుకున్నట్లు... ధోని కూడా మెడకు ఒక బ్యాగ్ తగిలించుకుని, అందులో కూతురును ఉంచి గుండెలకు హత్తుకుని తిరుగుతున్నాడు. కాలికి బలపం కట్టుకున్నట్లు ప్రపంచం అంతా తిరగడం ధోనికి అలవాటే. కానీ నెలల పాపను కూడా అలాగే తిప్పుతున్నాడు. ఐపీఎల్ వల్ల ఇంట్లో గడిపే సమయం లేకపోవడం వల్ల... జీవాను తీసుకుని అన్ని ఊళ్లూ తిరుగుతున్నాడు. ధోని కూతురు పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తున్నవారు అబ్బురపడుతున్నారు. మొత్తానికి నాన్నగా కూడా ధోని అప్పుడే ఫుల్ మార్క్‌లు కొట్టేశాడు.