ప్రపంచకప్ ముగిసింది. అనుకున్నంతగా ధోనీ రాణించలేదు. అంచనాలనూ అందుకోలేకపోయాడు. విమర్శలపాలయ్యాడు. ముఖ్యంగా లీగ్ దశలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వీరోచితంగా ఆడాల్సిన తరుణంలో ఎంఎస్ ధోనీ-కేదార్ జాదవ్‌లు సింగిల్స్ తీస్తూ అభిమానులు చిరాకు పరిచారు. గెలువాలన్న కసి కనబర్చలేకపోయారు. అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ధోనీ తన సత్తా చాటాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సమయోచితంగా, వీరోచితంగా ఆడుతూ..చివరివరకు పోరాడాడు. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ధోనీపైనే. ధోనీ ఏం నిర్ణయం తీసుకుంటాడు? అందరూ అనుకున్నట్టుగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అన్నదే హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రపంచకప్ ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వచ్చాయి. కానీ, త్వరలో జరగబోయే వెస్టిండీస్ టూర్ తర్వాత ధోనీ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ఇప్పుడు అంటున్నారు. అయితే, ధోనీ టీమిండియా వెంట వెస్టిండీస్ వెళతాడా? లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లబోయే జట్టును ఈ నెల 19న బీసీసీఐ ప్రకటించబోతోంది. ఈ జట్టులో ధోనీ ఉంటాడా? ఉండడా? అన్న దానిపై బీసీసీఐకి చెందిన ఓ విశ్వసనీయ వ్యక్తి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా జట్టులో ధోనీ ఉండరు. ఆయన వెస్టిండీస్ వెళ్లినా.. జట్టులోని 15 మంది సభ్యుల్లో ఒకడిగా వెళుతారు. కానీ, మైదానంలో ఆడే 11 మందిలో ఉండరు. ఫస్ట్ చాయిస్ కీపర్‌గా ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నారు. పంత్ కుదురుకునేవరకు ధోనీ జట్టులో ఉండి.. అతనికి మార్గదర్శిగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రస్తుత జట్టుకు ధోనీ మార్గదర్శకత్వం చాలా విషయాల్లో అవసరముంది. కాబట్టి ఇప్పుడు ధోనీని జట్టుకు దూరం చేయడం ఆరోగ్యకరం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లెక్కన ధోనీ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినా.. మైదానంలో ఆడే తుది జట్టులో ఉండబోడని బీసీసీఐ వర్గాల్లో వినిపిస్తోంది.
పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోనీ తప్పుకున్నప్పటికీ.. సారథ్యం విషయంలో కోహ్లికి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో పర్యాయం కూడా ధోనీ సారథిగా వ్యవహరించే అవకాశముంది. 2018లో చెన్నై ఫ్రాంచైజీతో మూడేళ్ల ఒప్పందాన్ని ధోనీ కుదుర్చుకున్నారు. కాబట్టి మరో ఏడాది ఐపీఎల్‌లో ఎల్లో బ్రిగేడ్ కెప్టెన్‌గా ధోనీ సేవలందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment