అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం! | MSK Prasad on his performance as selector | Sakshi
Sakshi News home page

అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం!

Published Thu, Nov 28 2019 5:03 AM | Last Updated on Thu, Nov 28 2019 5:03 AM

MSK Prasad on his performance as selector - Sakshi

ఎమ్మెస్కే ప్రసాద్‌

ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎన్ని...? అతని అనుభవం ఎంత? ఏడాది పాటు సెలక్టర్‌గా, ఆ తర్వాత చీఫ్‌ సెలక్టర్‌గా పని చేసిన మూడేళ్ల కాలంలో అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి లెక్క లేనన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న ఎదురవుతూ వచ్చింది. ముఖ్యంగా కీలక, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నప్పుడైతే వీరంతా ప్రసాద్‌ను విమర్శించడంలో ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. కానీ సెలక్టర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించడం తప్ప విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెస్కే వ్యాఖ్యానించారు.

ముంబై: భారత జట్టు సాధిస్తున్న విజయాలే తమ సెలక్షన్‌  కమిటీ పనితీరుకు సూచిక అని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ‘మేం ఎన్ని మ్యాచ్‌లు ఆడామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా, ఎంత అంకితభావంతో పని చేశామన్నదే ముఖ్యం. మాకంటే ఎక్కువ క్రికెట్‌ ఆడినవాళ్లు కూడా సెలక్టర్లుగా విఫలమయ్యేవారేమో. ఏదేమైనా విజయాలే మన గురించి చెబుతాయి. ప్రస్తుతం భారత జట్టు అన్ని ఫార్మాట్‌లలో ఎలా ఆడుతుందో చూస్తే చాలు. గతంలో ఏ సెలక్షన్‌ కమిటీకి కూడా మా అంత మెరుగైన రికార్డు లేదు.

అనుభవం లేనివాళ్లమే అయినా విజయవంతమైన జట్లను ఎంపిక చేశాం. సీనియర్‌ టీమ్‌ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా ‘ఎ’ జట్లయితే విశేషంగా రాణించాయి. 13 సిరీస్‌లు ఆడితే అన్నీ గెలిచాయి. సీనియర్‌ టీమ్‌లో ఇప్పుడు మ్యాచ్‌ ఫలితాలను శాసించగల ఎనిమిది మంది ఫాస్ట్‌ బౌలర్లు, ప్రధాన స్పిన్నర్లతో పాటు మరో ఆరుగురు స్పిన్నర్లు, ఆరుగురు సమర్థులైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకా మా నుంచి ఏం ఆశిస్తున్నారు’ అని ఎమ్మెస్కే వివరించారు. ప్రపంచకప్‌ సెమీస్‌లో పరాజయానికి ‘నాలుగో స్థానం’ కారణం కాదని, సెమీఫైనల్‌ మ్యాచ్‌ వరకు కూడా నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడటం జరగనే లేదని ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

ఒకరిద్దరు మినహా తాము అవకాశం ఇచ్చిన కొత్త ఆటగాళ్లంతా సత్తా చాటారన్న మాజీ వికెట్‌ కీపర్‌... బుమ్రాను టెస్టుల్లోకి ఎంపిక చేయడం తమ అత్యుత్తమ నిర్ణయమన్నారు. సెలక్టర్‌గా పని చేసేటప్పుడు విమర్శలు రావడం సహజమేనన్న ఎమ్మెస్కే... ధోని, కోహ్లిలతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ‘మేనేజ్‌మెంట్‌ విద్యార్థినైన నేను ఆంధ్ర క్రికెట్‌ డైరెక్టర్‌గా ఇంతకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలక్టర్‌గా ఉన్న సమయంలో నేను దిగ్గజ క్రికెటర్ల సలహాలు తీసుకుంటూ వచ్చాను. ధోని, కోహ్లిలతో నా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు. జనం ఏమైనా అనుకోవచ్చు గానీ వారిద్దరు నన్ను ఎంతగా గౌర విస్తారో నాకు తెలుసు’ అని ప్రసాద్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement