
నాగ్‌పూర్: అద్భుతంగా ఆడితే తప్ప ‘రంజీ రారాజు’ ముంబై ఈసారి సెమీస్‌కు చేరడం కష్టమే. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటకకు 397 పరుగులు ఆధిక్యం సమర్పించుకుని... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆ జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి 120 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 395/6తో మూడో రోజును మొదలుపెట్టిన కర్ణాటక 570 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ గోపాల్ (274 బంతుల్లో 150 నాటౌట్; 11 ఫోర్లు) భారీ శతకం సాధించాడు. 11వ నంబర్ ఆటగాడు శ్రీనాథ్ అరవింద్ (41 బంతుల్లో 51; 9 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధసెంచరీ చేయడం విశేషం. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ముంబైకి మళ్లీ నిరాశే ఎదురైంది. యువ సంచలనం పృథ్వీషా (14)తో పాటు మరో ఓపెనర్ జే బిస్తా (20), అఖిల్ హెర్వాడ్కర్ (26) విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (55 బ్యాటింగ్) పోరాడుతున్నాడు. మరో రెండు రోజులు ఉన్నందున ఓటమి తప్పించుకోవడం ముంబైకి కష్టమే. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక సెమీస్‌కు చేరే అవకాశాలే ఎక్కువ.
బెంగాల్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
జైపూర్: పేసర్లు అశోక్ దిండా (3/48), ఇషాన్ పొరెల్ (3/64), అమిత్ (3/53) సమష్టిగా రాణించడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌ను 224 పరుగులకే కట్టడి చేసింది. కీలకమైన 130 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (93 బ్యాటింగ్), రామన్ (33) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి బెంగాల్ వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. ఇప్పటికే బెంగాల్ 307 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్‌పై ఢిల్లీ పైచేయి
సాక్షి, విజయవాడ: లెగ్ స్పిన్నర్ మిహిర్ హీర్వాణి (5/89) అద్భుత ప్రదర్శన చేసినా... ఢిల్లీపై మధ్యప్రదేశ్ ఆధిక్యం సాధించలేకపోయింది. విజయవాడలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం 180/2తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 405 పరుగులకు ఆలౌటైంది. కునాల్ చండేలా (81), ధ్రువ్ షరాయ్ (78), హిమ్మత్‌సింగ్ (71) అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రిషభ్ పంత్ (49) రాణించడంతో కీలకమైన 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
కేరళ 176 ఆలౌట్
సూరత్: విదర్భ మీడియం పేసర్ రజనీష్ గుర్బానీ (5/38) ధాటికి కేరళ 176 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 32/2తో శనివారం ఆట ప్రారంభించిన ఆ జట్టు బ్యాట్స్‌మన్ వైఫల్యంతో ప్రత్యర్థికి 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయింది. జలజ్ సక్సేనా (40) టాప్ స్కోరర్. సంజూ శాంసన్ (32) విఫలమయ్యాడు. కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (51 బ్యాటింగ్) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 77/1 స్కోరుతో రోజు ముగించింది. ఇప్పటికి 147 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment