మరో టైటిల్‌పై... | mumbai indians Another Title ... | Sakshi
Sakshi News home page

మరో టైటిల్‌పై...

Published Sat, Apr 12 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

మరో టైటిల్‌పై...

మరో టైటిల్‌పై...

 ముంబై ఇండియన్స్...
 
 ఓనర్: ముకేశ్ అంబానీ (రిలయన్స్)
 (ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్)
 కెప్టెన్: రోహిత్ శర్మ
 కోచ్: జాన్ రైట్
 మెంటర్: సచిన్ టెండూల్కర్
 గత ఉత్తమ ప్రదర్శన:
 చాంపియన్ (2013), రన్నరప్ (2010)  
 కీలక ఆటగాళ్లు: రోహిత్ శర్మ, మైకేల్ హస్సీ, లసిత్ మలింగ, కీరన్ పొలార్డ్, కోరె అండర్సన్
 
 ఐపీఎల్ హాట్ ఫేవరెట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి... ఆరో సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లేకుండా తొలిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. అతని ఆధ్వర్యంలోనే ముంబై జట్టు ఐపీఎల్-6లో చాంపియన్‌గా నిలిచింది.

భారత క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్లతో ముంబై పటిష్టంగా కనిపిస్తోంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, లసిత్ మలింగ,  హర్భజన్ సింగ్, అంబటి రాయుడులను రిటైన్ చేసుకున్న జట్టు యాజమాన్యం... స్టార్ బ్యాట్స్‌మన్ మైకేల్ హస్సీను రూ. 5కోట్లకు, కోరె అండర్సన్‌ను రూ. 4.5 కోట్లకు కొనుగోలు చేసింది. భారత క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజాను రూ. 3.25 కోట్లకు, జహీర్ ఖాన్‌ను రూ.2.6 కోట్లకు సొంతం చేసుకుంది.
 
   డగౌట్‌లో మాస్టర్
 ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినా ముందుగా అందరి దృష్టి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌పైనే ఉండేది. ముంబై ఇండియన్స్ ఆడే ప్రతీ స్టేడియంలో అభిమానులంతా సచిన్ కోసమే ఎదురుచూసే వారు. ముంబై ఆడే మ్యాచ్‌లకైతే అస్సలు టికెట్లే దొరికేవి కావు.. అయితే సచిన్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పినా  మెంటర్ పాత్రలో ముంబై డగౌట్‌లోనే కనిపించనున్నాడు. కాబట్టి ముంబై అభిమానులకు సందడే.
 
   మలింగ సూపర్ ఫామ్

 మైక్ హస్సీ, లసిత్ మలింగ, పొలార్డ్... ముంబై ఇండియన్స్ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటే ఉన్న హస్సీని ముంబై యాజమాన్యం వేలం పాటలో దక్కించుకుంది. నిలకడగా బ్యాటింగ్ చేసే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐపీఎల్‌లో తన బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు మాస్టర్ లేని లోటు భర్తీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ మరోసారి ముంబైని విజేతగా నిలిపేందుకు సిద్ధమవుతున్నాడు. టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన మలింగ.. స్లాగ్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకోబోతున్నాడు.
 
     బలాలు...
 బలమైన బ్యాటింగ్ లైనప్.. ప్రత్యర్థులను దెబ్బతీసే పేసర్ల్లు... బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే స్పిన్నర్లు.


     బలహీనతలు...
 సచిన్ రిటైరవడం... రోహిత్, రాయుడు మినహాయిస్తే ధాటిగా బ్యాటింగ్ చేయగల భారత బ్యాట్స్‌మన్ లేకపోవడం.. విదేశీ బ్యాట్స్‌మెన్‌పైనే ఎక్కువగా అధారపడాల్సి రావడం... చెప్పుకోదగ్గ దేశవాళీ క్రికెటర్లు లేకపోవడం ముంబై బలహీనతలుగా చెప్పవచ్చు.  
 
  జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, జహీర్ ఖాన్.


 విదేశీ క్రికెటర్లు: లసిత్ మలింగ (శ్రీలంక), మైకేల్ హస్సీ, జోష్ హజిల్‌వుడ్, బెన్ డంక్ (ఆస్ట్రేలియా),  కీరన్ పొలార్డ్, క్రిష్‌మర్ సాంటొకీ (వెస్టిండీస్), కోరె అండర్సన్ (న్యూజిలాండ్), మర్చంట్ డి లాంజ్ (దక్షిణాఫ్రికా).


 భారత దేశవాళీ క్రికెటర్లు: ఆదిత్య తారే, జస్‌ప్రీత్ బుమ్‌రాహ్, జలజ్ సక్సేనా, సి.ఎం. గౌతమ్, అపూర్వ్ వాంఖడె, పవన్ సుయల్, సుశాంత్ మరాతే, శ్రేయాస్ గోపాల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement