‘శతక’బాదిన సిమ్మన్స్
ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు
పంజాబ్‌పై ముంబై ఘన విజయం
ప్లే ఆఫ్ ఆశలు సజీవం
మొహాలీ: ఐపీఎల్‌లో విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పంజాబ్ జట్టును ముంబై ఇండియన్స్ మాత్రం చక్కగా కట్టడి చేస్తోంది. అందరికీ కొరకరాని కొయ్యగా కనిపిస్తున్న పంజాబ్‌ను ఈ సీజన్‌లో రెండోసారి ఓడించింది. లెండిల్ సిమ్మన్స్ (61 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేయడంతో... బుధవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
పీసీఏ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. బెయిలీ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వోహ్రా (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్లు), మార్ష్ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బుమ్రా, గోపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. సిమ్మన్స్‌కు తోడు రోహిత్ (18), రాయుడు (17) ఫర్వాలేదనిపించారు. హెండ్రిక్స్, అక్షర్, ధావన్ తలా ఓ వికెట్ తీశారు.
తడబడి పుంజుకుని...
ఓపెనర్లలో సెహ్వాగ్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) వచ్చి రావడంతోనే ఫోర్, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ మూడో ఓవర్ తొలి బంతికే అనూహ్యంగా రనౌటయ్యాడు. పవర్‌ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది.
గోపాల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపుమీదున్న మార్ష్‌ను సంతోకి బోల్తా కొట్టించాడు. దీంతో రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
11వ ఓవర్‌లో గోపాల్ పంజాబ్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. మూడు బంతుల వ్యవధిలో వోహ్రా, ‘డేంజర్ మ్యాన్’ మాక్స్‌వెల్ (2)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో పంజాబ్ 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చివర్లో బెయిలీ, ధావన్ (14 నాటౌట్) ఏడో వికెట్‌కు 20 బంతుల్లో 38 పరుగులు జోడించడంతో పంజాబ్ పోరాడే స్కోరు సాధించింది.
కీలక భాగస్వామ్యాలు
హస్సీ (6)ని క్రీజులో నిలబెట్టి ఓ ఎండ్‌లో సిమ్మన్స్ విజృంభించాడు. బౌలర్ ఎవరైనా ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో ముంబై స్కోరు వేగంగా కదిలింది. ఈ క్రమంలో 27 బంతుల్లోనే సిమ్మన్స్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
నిలకడగా ఆడుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. హస్సీని క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
సిమ్మన్స్‌తో జత కలిసిన రాయుడు (17) చక్కని సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాక రాయుడు వెనుదిరిగాడు.
అప్పటికే రెండు కీలక భాగస్వామ్యాలు జోడించిన సిమ్మన్స్‌కు రోహిత్ కూడా అండగా నిలిచాడు. సహచరుడికి ఎక్కువగా స్ట్రయికింగ్ ఇవ్వడంతో విండీస్ ప్లేయర్ బ్యాట్ ఝుళిపించాడు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ రనౌట్ 17; వోహ్రా (బి) గోపాల్ 36; మార్ష్ (సి) పొలార్డ్ (బి) సంతోకి 30; మాక్స్‌వెల్ (సి) అండ్ (బి) గోపాల్ 2; బెయిలీ (సి) రాయుడు (బి) బుమ్రా 39; సాహా రనౌట్ 3; అక్షర్ పటేల్ (సి) రోహిత్ (బి) ప్రవీణ్ 6; రిషీ ధావన్ నాటౌట్ 14; హెండ్రిక్స్ (బి) బుమ్రా 0; శివం శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 156.
వికెట్ల పతనం: 1-23; 2-87; 3-92; 4-93; 5-105; 6-116; 7-154; 8-155
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-20-1; సంతోకి 4-0-40-1; బుమ్రా 4-0-31-2; ఓజా 4-0-28-0; గోపాల్ 4-0-32-2
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ నాటౌట్ 100; మైక్ హస్సీ (బి) అక్షర్ 6; రాయుడు (సి) సెహ్వాగ్ (బి) ధావన్ 17; రోహిత్ (సి) సందీప్ (బి) హెండ్రిక్స్ 18; పొలార్డ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1-68, 2-111; 3-148
బౌలింగ్: సందీప్ 3-0-37-0; హెండ్రిక్స్ 4-0-33-1; అక్షర్ పటేల్ 4-0-27-1; రిషీ ధావన్ 4-0-30-1; శివం శర్మ 4-0-32-0.
29 ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది 29వ సెంచరీ
చాలా సంతోషంగా ఉంది. సెంచరీ చేస్తానని అనుకోలేదు. ఐపీఎల్ కోసం ముంబై జట్టు నుంచి పిలుపు వచ్చినప్పుడు చాలా ఉద్వేగంగా అనిపించింది.
- లెండిల్ సిమ్మన్స్
‘క్లాస్’ ఇన్నింగ్స్
టి 20 క్రికెట్ అంటే బాదుడు. ఎవరైనా ఆటగాడు సెంచరీ చేశాడంటే కచ్చితంగా అది పెను విధ్వంసంలా కనిపిస్తుంది. రకరకాల ప్రయోగాలతో కొత్త షాట్లు ఆడితేనే శతకం సాధ్యమవుతుంది. కానీ బుధవారం సిమ్మన్స్ చేసిన సెంచరీ వీటికి పూర్తిగా భిన్నం. ఏ మాత్రం తడబాటు, హడావుడి లేకుండా... కామ్‌గా తన పని తాను చేసుకుపోతూ సెంచరీ చేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పిచ్చి షాట్ లేదు. అడ్డంగా బాదటం అసలే లేదు. అన్నీ పూర్తిగా క్రికెటింగ్ షాట్స్. ఆఫ్‌సైడ్ కట్ షాట్స్‌తో క ళ్లుచెదిరాయి.
బౌలర్ తలపైనుంచి బలంగా బాదిన బంతిని చూడటం ఓ ఆహ్లాదం. రివర్స్ స్వీప్‌లు, స్విచ్ హిట్‌లు ఏమీ లేవు. టి20 క్రికెట్‌లో ఇలాంటి సెంచరీ అరుదు. పవర్‌ప్లేలో పూర్తి దూకుడు ప్రదర్శించిన సిమ్మన్స్... ఆ తర్వాత లక్ష్యానికి తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. ఏ మాత్రం చెత్త బంతి పడ్డా చుక్కలు చూపించాడు. ఈ సీజన్‌లో సెంచరీ సిమ్మన్స్ నుంచి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్వతహాగా తను బాగా వేగంగా ఆడే ఆటగాడు కాదు. మొత్తానికి ఈ సీజన్‌లో తొలి సెంచరీ వెస్టిండీస్ క్రికెటర్ నుంచి రావడమే అసలు విశేషం.
బంతులు పరుగులు
110 : 17
1120 : 17
2130 : 25
3140 : 16
4150 : 16
5161 : 9
మొత్తం: 100 నాటౌట్
(61బంతుల్లో )
14 ఫోర్లు, 2 సిక్సర్లు