ఆండర్సన్ అదుర్స్; ప్లే ఆప్ లో ముంబై
ముంబై: ఐపీఎల్-7లో మరో అద్భుతం నమోదయింది. అసాధ్యమనుకున్న దాన్ని సొంత మైదానంలో సుసాధ్యం చేసి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు. చావురేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విజృంభించి ఆడి విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని 14.4 ఓవర్లలోనే ఛేధించి ప్లే ఆప్ లోకి దూసుకెళ్లింది.
వాంఖేడ్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోవై ఆండర్సన్ విజృంభించి ఆడి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 10 బంతుల్లో 30 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు.
14.3 ఓవర్లలో ముంబై లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది. అయితే 14.3 ఓవర్లలో ముంబై 189 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. తర్వాతి బంతికి ఫోర్ కొడితే ముంబై ప్లే ఆప్ కు చేరుతుందని ప్రకటించారు. దీంతో ఇరు జట్లతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠకు లోనయ్యారు. ఫాల్కనర్ బౌలింగ్ లో తారే సిక్స్ బాది ముంబైను ప్లే ఆప్ కు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కోవె ఆండర్సన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్కతా నైట్రైడర్స్ 14.2 ఓవర్లలో 161 పరుగులు ఛేదిస్తే ముంబై ఏకంగా 14.4 ఓవర్లలోనే 195 పరుగులు చేసి అత్యద్భుత మనిపించింది. కోల్ కతాలో యూసఫ్ పఠాన్ చెలరేగితే, ముంబై జట్టులో ఆండర్సన్ అద్భుతం చేశాడు. అత్యంత ధర చెల్లించి దక్కించుకున్న ఆండర్సన్ ఇప్పటివరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ సరైన సమయంలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును ప్లే ఆప్ కు చేర్చాడు.