ముంబై మహాన్‌ | Mumbai Indians edge Supergiant in one-run thriller to win third IPL title | Sakshi
Sakshi News home page

ముంబై మహాన్‌

Published Mon, May 22 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

ముంబై మహాన్‌

ముంబై మహాన్‌

ఐపీఎల్‌–10 విజేత ముంబై ఇండియన్స్‌
మూడోసారి టైటిల్‌ సాధించిన రోహిత్‌ సేన
ఫైనల్లో పరుగు తేడాతో పుణేపై అద్భుత విజయం
కృనాల్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
స్మిత్‌ పోరాటం వృథా   


డ్రామా... చివరి బంతి వరకు డ్రామా... తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్‌ ఫైనల్‌ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే  సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది.

ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్‌ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్‌ చేసిన జాన్సన్‌ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్‌ త్రోకు క్రిస్టియాన్‌ అవుటయ్యాడు.

పాపం రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టి20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్‌ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్‌ స్మిత్‌ చివరకు ఈ పాపంలో భాగమయ్యాడు.  

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2017 టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా పట్టుదలగా ఆడిన రోహిత్‌ సేన ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్‌ జెయింట్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ అవార్డు లభించింది.

కీలక  భాగస్వామ్యం...
ఆరంభంలో ముంబై ఇండియన్స్‌ ప్రదర్శన గత మ్యాచ్‌లో కోల్‌కతా ఆటను తలపించింది. పుణే పదునైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలం కాగా, చివర్లో కృనాల్‌ ఇన్నింగ్స్‌ ఆ జట్టును నిలబెట్టింది. ఐపీఎల్‌ ఫైనల్లో 31వ బంతికి గానీ తొలి ఫోర్‌ రాలేదు... ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ మందగమనానికి ఇది ఉదాహరణ. తొలి రెండు ఓవర్లలో 7 పరుగులే రాగా... మూడో ఓవర్లో ఉనాద్కట్‌ రెండు వికెట్లతో దెబ్బ తీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి పార్థివ్‌ (4) అవుట్‌ కాగా, అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌తో సిమన్స్‌ (3) ఆటను ఉనాద్కట్‌ ముగించాడు.

 తొలి 5 ఓవర్లలో 16 పరుగులే చేయగలిగిన ముంబై, ఆరో ఓవర్లో మరో 16 పరుగులతో పవర్‌ప్లేను 32 పరుగులతో ముగించింది. ఫెర్గూసన్‌ వేసిన ఈ ఓవర్లో రోహిత్‌ నాలుగు ఫోర్లు బాదడం విశేషం. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. స్మిత్‌ చక్కటి త్రోకు అంబటి రాయుడు (12) రనౌట్‌ కాగా, జంపా ఒకే ఓవర్లో రోహిత్, పొలార్డ్‌ (7) వికెట్లు తీశాడు. శార్దుల్‌ ఠాకూర్‌ సమయస్ఫూర్తితో బౌండరీ వద్ద క్యాచ్‌ పట్టి రోహిత్‌ను వెనక్కి పంపగా, జంపా బౌలింగ్‌లో తివారీ చేతికి పొలార్డ్‌ చిక్కాడు.

 క్రిస్టియాన్‌ బంతికి హార్దిక్‌ పాండ్యా (10) అవుట్‌ కాగా, అతని అద్భుత ఫీల్డింగ్‌కు కరణ్‌ శర్మ (1) రనౌటయ్యాడు. ఈ దశలో కృనాల్, జాన్సన్‌ జోడి ముంబైని ఆదుకుంది. ఫలితంగా చివరి మూడు ఓవర్లలో జట్టు 37 పరుగులు సాధించింది. క్రిస్టియాన్‌ వేసిన చివరి ఓవర్లో ఫోర్, సిక్స్‌ బాదిన కృనాల్‌ ఆఖరి బంతికి అవుటయ్యాడు. కృనాల్, జాన్సన్‌ ఎనిమిదో వికెట్‌కు 36 బంతుల్లో 50 పరుగులు జోడించారు.

అతి జాగ్రత్త...
పుణే ఇన్నింగ్స్‌ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. రాహుల్‌ త్రిపాఠి (3)ని బుమ్రా అవుట్‌ చేయగా... రహానే, స్మిత్‌ కలిసి జాగ్రత్తగా ఆడారు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోలేదు. మధ్యలో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడినా... స్మిత్‌ తన 23వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేదు. అయితే 14 పరుగుల వద్ద రహానే ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కృనాల్‌ వదిలేయడం పుణేకు కలిసొచ్చింది. అయితే ఈ భాగస్వామ్యం మాత్రం మరీ నెమ్మదిగా సాగింది. చివరకు 57 బంతుల్లో 54 పరుగులు జోడించిన తర్వాత రహానేను అవుట్‌ చేసి జాన్సన్‌ ఈ జోడీని విడదీశాడు.ఆ తర్వాతి ముంబైకి ఒక్కసారిగా పట్టు చిక్కింది. ధోని (10), తివారి (7) విఫలం కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. చివరి వరకు ఒంటరిగా పోరాడిన స్మిత్‌ జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (సి అండ్‌ బి) ఉనాద్కట్‌ 3; పార్థివ్‌ పటేల్‌ (సి) శార్దుల్‌ (బి) ఉనాద్కట్‌ 4; రాయుడు రనౌట్‌ 12; రోహిత్‌ శర్మ (సి) శార్దుల్‌ (బి) జంపా 24; కృనాల్‌ పాండ్యా (సి) రహానే (బి) క్రిస్టియాన్‌ 47; పొలార్డ్‌ (సి) తివారీ (బి) జంపా 7; హార్దిక్‌ పాండ్యా ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్‌ 10; కరణ్‌ శర్మ రనౌట్‌ 1; జాన్సన్‌ నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129.

వికెట్ల పతనం: 1–7, 2–8, 3–41, 4–56, 5–65, 6–78, 7–79, 8–129. బౌలింగ్‌: ఉనాద్కట్‌ 4–0–19–2, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–13–0, శార్దుల్‌ ఠాకూర్‌ 2–0–7–0, ఫెర్గూసన్‌ 2–0–21–0, జంపా 4–0–32–2, క్రిస్టియాన్‌ 4–0–34–2.

రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) పొలార్డ్‌ (బి) జాన్సన్‌ 44; రాహుల్‌ త్రిపాఠి ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 3; స్మిత్‌ (సి) రాయుడు (బి) జాన్సన్‌ 51; ధోని (సి) పార్థివ్‌ పటేల్‌ (బి) బుమ్రా 10; మనోజ్‌ తివారీ (సి) పొలార్డ్‌ (బి) జాన్సన్‌ 7; క్రిస్టియాన్‌ రనౌట్‌ 4; సుందర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 128.

వికెట్ల పతనం: 1–17, 2–71, 3–98, 4–123, 5–123, 6–128.

బౌలింగ్‌: కృనాల్‌ 4–0–31–0, జాన్సన్‌ 4–0–26–3, బుమ్రా 4–0–26–2, మలింగ 4–0–21–0, కరణ్‌ శర్మ 4–0–18–0.  

ఐపీఎల్‌–10 అవార్డీలు
అరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు; రూ.10 లక్షలు):
వార్నర్‌ (641 పరుగులు; హైదరాబాద్‌)
 పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు; రూ.10 లక్షలు):
భువనేశ్వర్‌ (26 వికెట్లు; హైదరాబాద్‌)
ఫర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ (రూ.10 లక్షలు):  సురేశ్‌ రైనా
ఎమర్జింగ్‌ ప్లేయర్‌ (రూ. 10 లక్షలు): బాసిల్‌ థంపీ
ఫెయిర్‌ ప్లే అవార్డు : గుజరాత్‌ లయన్స్‌
మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (రూ. 10 లక్షలు): బెన్‌ స్టోక్స్‌
రన్నరప్‌ (రూ. 10 కోట్లు): రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌
విన్నర్‌ (రూ. 15 కోట్లు): ముంబై ఇండియన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement