ముంబై మురిసింది
► బెంగళూరుపై స్ఫూర్తిదాయక విజయం
► రాణించిన రోహిత్, రాయుడు, పొలార్డ్
సొంతగడ్డపై రెండు ఓటములు... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు... స్థాయికి తగ్గట్లుగా ఆడని ఆటగాళ్లు... ఇదీ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ముంబై పరిస్థితి. కానీ పటిష్టమైన రాయల్ చాలెంజర్స్‌పై భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించిన రోహిత్‌సేన... ఈ సీజన్‌లో సొంతగడ్డపై విజయాల బోణీ చేసింది.
ముంబై: లక్ష్య ఛేదనలో చెలరేగిన ముంబై ఇండియన్స్... ఈ సీజన్‌లో సొంతగడ్డపైతొలి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పొలార్డ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో బుధవారం జరిగిన ఐపీఎల్-9 లీగ్ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో బెంగళూర్‌పై గెలిచింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 33; 3 ఫోర్లు), డివిలియర్స్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (18 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. తర్వాత ముంబై 18 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. తిరుపతి రాయుడు (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.
సమష్టిగా రాణింపు
ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు కోహ్లి, రాహుల్ శుభారంభాన్నిచ్చారు. నాలుగో ఓవర్‌లో రాహుల్ వరుసగా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో జోరు పెరిగింది. కానీ తర్వాతి బంతికే అతను అవుట్‌కావడంతో బెంగళూరు 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డివిలియర్స్, కోహ్లి మరింత దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగించారు. దీంతో పవర్‌ప్లేలో 49/1 ఉన్న బెంగళూరు స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 89/1కి చేరింది. ఈ దశలో క్రునాల్ (11వ ఓవర్) ఐదు బంతుల వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేసి ఆర్‌సీబీకి షాకిచ్చాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 6.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశారు. తర్వాత వాట్సన్ (5) నిరాశపర్చినా.. హెడ్, సర్ఫరాజ్‌లు సమయోచితంగా ఆడారు. ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 63 పరుగులు జోడించాక హెడ్ రనౌటయ్యాడు. మరో రెండు బంతుల తర్వాత సర్ఫరాజ్, ఆ వెంటనే బిన్నీ (1) కూడా వెనుదిరిగాడు. బుమ్రా 3, క్రునాల్ 2 వికెట్లు తీశారు.
రోహిత్ అదుర్స్
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై రెండో ఓవర్‌లోనే పార్థీవ్ (5) వికెట్ కోల్పోయినా... రోహిత్ శర్మ యాంకర్ పాత్ర పోషించాడు. రాయుడుతో కలిసి ఇన్నింగ్స్‌ను క్రమంగా నిర్మించాడు. పవర్‌ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌లో రోహిత్ భారీ సిక్సర్ బాదితే.. పదో ఓవర్‌లో రాయుడు వరుస ఫోర్లతో వేగం పెంచాడు. కానీ 11వ ఓవర్‌లో అబ్దుల్లా... రాయుడును అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత బట్లర్ (14 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కుదురుగా ఆడినా... 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రోహిత్ 13వ ఓవర్‌లో మరో సిక్స్, ఫోర్ బాది ఆ వెంటనే అవుటయ్యాడు. ఇక 36 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన దశలో బిగ్ హిట్టర్ పొలార్డ్ చెలరేగడంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సౌతీ (బి) క్రునాల్ 33; రాహుల్ (సి) హర్భజన్ (బి) మెక్లీనగన్ 23; డివిలియర్స్ (స్టం) పార్థీవ్ (బి) క్రునాల్ 29; వాట్సన్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 5; హెడ్ రనౌట్ 37; సర్ఫరాజ్ (సి) క్రునాల్ (బి) బుమ్రా 28; బిన్నీ (సి) హార్దిక్ (బి) బుమ్రా 1; హర్షల్ నాటౌట్ 0; రిచర్డ్‌సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170.
వికెట్ల పతనం: 1-32; 2-91; 3-93; 4-99; 5-162; 6-169; 7-169.
బౌలింగ్: సౌతీ 4-0-25-0; మెక్లీనగన్ 4-0-46-1; బుమ్రా 4-0-31-3; హర్భజన్ 2-0-20-0; క్రునాల్ పాండ్యా 4-0-27-2; హార్దిక్ పాండ్యా 2-0-18-2.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డివిలియర్స్ (బి) ఇక్బాల్ అబ్దుల్లా 62; పార్థీవ్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్‌సన్ 5; రాయుడు (సి) రిచర్డ్‌సన్ (బి) అబ్దుల్లా 31; బట్లర్ (సి) వాట్సన్ (బి) అబ్దుల్లా 28; పొలార్డ్ నాటౌట్ 40; హార్దిక్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (18 ఓవర్లలో 4 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1-6; 2-82; 3-109; 4-140.
బౌలింగ్: ఆరోన్ 4-0-37-0; రిచర్డ్‌సన్ 3-0-26-1; వాట్సన్ 4-0-40-0; హర్షల్ 2-0-20-0; ఇక్బాల్ అబ్దుల్లా 4-0-40-3; బిన్నీ 1-0-8-0.