సమష్టి మంత్రమే ఆయుధంగా...
♦ ముంబై ఇండియన్స్ విజయ రహస్యం
♦ వ్యూహాత్మక ఆటతీరుతో అనుకున్న ఫలితం
♦ అన్ని విభాగాల్లో సమతూకం
‘వ్యక్తిగత ప్రదర్శన ఒక్కోసారి మ్యాచ్‌లను గెలిపిస్తుందేమో కానీ... ఆటగాళ్ల సమష్టి కృషితోనే చాంపియన్లుగా ఎదుగుతాం’ ఐపీఎల్ పదో సీజన్ టైటిల్‌ను గెలిచిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి ప్రారంభం నుంచి ముంబై ప్రదర్శన గమనిస్తే ఇది వాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్–5 ఆటగాళ్లలో ఒక్కరు కూడా ముంబై బ్యాట్స్‌మన్ లేడు. అంతా కలిసికట్టుగా రాణించి తమ జట్టును విజేతగా నిలపగలిగారు.
సాక్షి క్రీడా విభాగం : ముంబై ఇండియన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది. అయితే 2013, 2015లో సాధించిన టైటిళ్లకన్నా ఈసారి వీరి ప్రస్థానం ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడకుండా జట్టు అందరికన్నా మిన్నగా దూసుకెళ్లింది. కీలక సమయంలో తలా ఓ చేయి వేసి జట్టును సమున్నత స్థాయిలో నిలిపారు. దీనికి అన్ని విభాగాల్లో సమతూకంతో ఉన్న జట్టు బాగా ఉపయోగపడింది. చక్కటి కాంబినేషన్‌తో టోర్నీ ఆసాంతం ముంబై అదరగొట్టింది. ఆఖరికి రిజర్వ్ బలం కూడా తమకు అందిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలిగింది.
ఇంతకుముందు సాధించిన రెండు టైటిళ్లలో కచ్చితంగా ఒక్క బ్యాట్స్‌మన్ అయినా టాప్–5 పరుగుల జాబితాలో ఉన్నాడు. ఈసారి మాత్రం వీరిలో ఎవరికీ చోటు దక్కలేదు. అయితేనేం జట్టుకు కావల్సిన విలువైన పరుగులు అందిస్తూ చాంపియన్‌గా నిలపగలిగారు. ఒక్కో సందర్భంలో ఒక్కో ఆటగాడు బాధ్యత తీసుకుని అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ కావచ్చు ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఉపయోగపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. ఓ రెండు క్యాచ్‌లు మిస్ అయినా చివరకు మేజిక్ ఆటతో పుణేను వణికించారు.
ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో నితీశ్ రాణా, పార్థివ్ పటేల్, పొలార్డ్, రోహిత్ శర్మ, జోస్ బట్లర్... బౌలింగ్‌లో బుమ్రా, మెక్లీనగన్, కరణ్ శర్మ, మలింగ ఆకట్టుకోగా... పాండ్యా బ్రదర్స్ హార్దిక్, కృనాల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై విజయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. మైదానంలో ఆటగాళ్లు కష్టపడగా... తెర వెనుక ఉన్న హెడ్ కోచ్ మహేల జయవర్ధనే, బ్యాటింగ్ కోచ్ రాబిన్ సింగ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ముంబై సక్సెస్‌లో తమవంతు పాత్ర పోషించారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మెంటార్ రూపంలో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది.
రోహిత్ కెప్టెన్సీ అదుర్స్...
ఓవరాల్‌గా జట్టును మూడోసారి చాంపియన్‌గా నిలపడంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను ప్రేరేపించిన విధానం ప్రశంసనీయం. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో అతని చొరవ ఆటగాళ్లను ఉత్తేజపరిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు కనీసం 160 పరుగులైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మ్యాచ్ ఆరంభం నుంచే ముంబై టపటపా వికెట్లు కోల్పోయి కేవలం 129 పరుగులకే పరిమితం కావడంతో ఓరకమైన నిర్వేదం కనిపించింది. కచ్చితంగా ఓటమి ఖాయమే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమైంది.
అయితే సారథి రోహిత్ మాత్రం దీన్ని ఓ సవాల్‌గా స్వీకరించాడు. బరిలోకి దిగడానికి ముందే ఆటగాళ్లలో విశ్వాసం నింపాడు. ‘రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కేవలం 107 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం గుర్తుంచుకోండి. అదే ఇక్కడా ఎందుకు పునరావృతం కాకూడదు? ప్రత్యర్థిపై మనకు పేలవ రికార్డు ఉన్నప్పటికీ ఆ విషయం మరిచిపోండి’ అని వారికి ప్రేరణ ఇచ్చాడు. ఇక బరిలోకి దిగాక తన వ్యూహాలకు పదునుపెడుతూ ముందుగా పరుగులను నియంత్రించేందుకు స్పిన్నర్లు కరణ్ శర్మ, కృనాల్ పాండ్యాలతో బౌలింగ్ వేయించాడు.
ఈ వ్యూహం ఫలితాన్నిచ్చి పుణే పరుగుల తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. అటు బుమ్రా, మలింగ, జాన్సన్ కూడా జత కలవడంతో వారికి దిక్కు తోచలేదు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టి పుణేకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దీంతో సునాయాసంగా నెగ్గుతుందని భావించిన పుణే భంగపడగా.. ఆఖరి బంతి వరకు ముంబై బౌలర్లు పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.