'ఆ ఇద్దరి బౌలర్లకు మాత్రమే భయపడేవాణ్ని'
న్యూఢిల్లీ: దూకుడైన బ్యాటింగ్తో ఎందరో బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో స్పిన్ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్ల మాత్రమే భయపడ్డానని చెప్పాడు. ఢిల్లీకి వచ్చిన గిల్క్రిస్ట్.. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా కొంతమంది పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఎవరి బౌలింగ్కు భయపడేవారన్న ప్రశ్నకు ఆసీస్ మాజీ కీపర్ సమాధానమిస్తూ.. మురళీ, భజ్జీలకు అని చెప్పాడు. మురళీ వేసే స్పిన్ బంతులను అంచనా వేయలేకపోయేవాడినని, 10 ఏళ్ల పిల్లాడిలా తికమకపడేవాడినని నాటి సంగతులు వెల్లడించాడు. 'ఓ టెస్టు మ్యాచ్లో మురళీ వేసిన తొలి బంతిని ఫోర్ బాదాను. రెండో బంతిని షాట్ ఆడబోగా, గాల్లోకి లేచింది. అంతే క్యాచ్ అవుటయ్యాను. తర్వాతి మ్యాచ్లో మురళీ బౌలింగ్లో తొలి బంతికే అవుటయ్యాను' అని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. తనతో పాటు సహచర క్రికెటర్ మైకేల్ హస్సీ కూడా మురళీ బౌలింగ్లో ఆడేందుకు ఇబ్బందిపడేవాడని చెప్పాడు.