![Murali Vijay expresses disappointment at lack of communication - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/5/Untitled-5.jpg.webp?itok=C65iUVtg)
ముంబై: టెస్టు జట్టు నుంచి స్థానం కోల్పోయిన భారత ఓపెనర్ మురళీ విజయ్ సెలక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కరుణ్ నాయర్‌లాగే తనతో కూడా మాటమాత్రమైనా చెప్పకుండానే జట్టునుంచి తప్పించారని వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన విజయ్‌ని టీమ్ మేనేజ్‌మెంట్ మూడో టెస్టు ఆడించకుండా పక్కనబెట్టింది. అనంతరం సెలక్టర్లు చివరి రెండు టెస్టులకు అతనిపై వేటు వేశారు. దీనిపై అతను మాట్లాడుతూ ‘మూడో టెస్టునుంచి నన్ను తప్పించిన తర్వాత చీఫ్ సెలక్టర్‌గానీ, మిగతా సెలక్టర్లుగానీ ఎవరూ నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇంగ్లండ్‌లో కేవలం జట్టు మేనేజ్‌మెంట్ మాత్రమే నాతో మాట్లాడింది. అంతకుమించి తొలగింపుపై నేను ఇంకెవరితోనూ మాట్లాడింది లేదు.
నాకు చెప్పింది లేదు’ అని అన్నాడు. జట్టుకు ఎంపికైనా కరుణ్ నాయర్‌కు ఒక్క టెస్టులోనూ అవకాశం ఇవ్వకుండానే ప్రస్తుత విండీస్ సిరీస్ నుంచి అతన్ని తప్పించడంపై విమర్శలొచ్చాయి. కరుణ్ తనను తప్పించడానికి గల కారణాలు, ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు సూచనలు ఎవరు చెప్పలేదని మీడియాతో అన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో 20, 6 పరుగులు చేసి విజయ్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. అయితే విజయ్ వ్యాఖ్యలపై కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడిని జట్టునుంచి తప్పించినప్పుడు అందుకు తగిన కార ణాలు వివరిస్తూ సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ స్పష్టంగా మాట్లాడినట్లు ప్రసాద్ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment