
వారెవ్వా.. విజయ్
రాంచీ:భారత క్రికెట్ జట్టులో మురళీ విజయ్ది ప్రత్యేకమైన స్థానం. ఎంతమంది ఓపెనర్లు వచ్చి వెళుతున్నా జట్టు ప్రయోజనాలకు కోసం అత్యంత ఎక్కువ శ్రమించే ఆటగాళ్లలో విజయ్ ఒకడు. ఈ క్రమంలోనే భారత్ జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో్ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇది విజయ్ టెస్టు కెరీర్ లో 15 వ హాఫ్ సెంచరీగా నమోదైంది.
ఇదిలా ఉంచితే టెస్టు కెరీర్ లో 9 సెంచరీలను సాధించిన విజయ్.. ఆసీస్ పై మాత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ రోజు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన తరువాత అతని కెరీర్ లో యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఆసీస్ పైనే అత్యధిక సార్లు సాధించడం ఇక్కడ విశేషం. తన టెస్టు కెరీర్ లో ఆసీస్ పై 10సార్లు యాభై ప్లస్ స్కోర్లను మురళీ విజయ్ నమోదు చేశాడు. తద్వారాఆసీస్ పైనే అత్యధిక సార్లు యాభై అంతకంటే ఎక్కువ వ్యక్తిగత పరుగుల్ని సాధించిన ఘనతను విజయ్ సొంతం చేసుకున్నాడు. కేవలం ఆసీస్ అంటేనే పూనకం వచ్చినట్లు ఆడే విజయ్.. మిగతా ఏ జట్టుపైనా కూడా యాభైకు పైగా స్కోర్లను ఐదుసార్ల కంటే ఎక్కువసార్లు నమోదు చేయలేదు.
120/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు లంచ్ కు ముందు మరో వికెట్ ను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు విజయ్(82;183 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత పెవిలియన్ చేరాడు. ఓకీఫ్ వేసిన ఇన్నింగ్స్ 71 ఓవర్ నాల్గో బంతికి ఫ్రంట్ ఫుట్ కు వచ్చి షాట్ కు యత్నించిన విజయ్ స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో 193 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది.