గాయంతోనే ఆడా: విజయ్
చెన్నై: భారత ఓపెనర్ మురళీ విజయ్ మణికట్టు గాయంతోనే సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడానని తెలిపాడు. మణికట్టుకు ఇంగ్లండ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్–10 మొత్తం సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ‘అప్పుడు గాయంపై పెద్దగా ఆలోచించకుండా ఆటను కొనసాగించాను. గాయం తీవ్రత దృష్ట్యా మణికట్టును మునుపటిలా కదిలించలేక సహజసిద్ధమైన షాట్లు స్వేచ్ఛగా ఆడలేకపోయా.
ముఖ్యంగా పేసర్లతో మరీ క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది’ అని విజయ్ తెలిపాడు. ఈ సీజన్‌లో సెప్టెంబర్‌లో కివీస్‌తో మొదలైన సిరీస్ నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 టెస్టులు జరగగా... విజయ్ ఒక్క టెస్టు (ఆస్ట్రేలియా) మినహా అన్ని మ్యాచ్‌లూ ఆడాడు. దీంతో చతేశ్వర్ పుజారా, కోహ్లి తర్వాత అత్యధిక పరుగులు (771) చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.