న్యూఢిల్లీ: 100 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాలనుకున్న తన కల కరోనా కారణంగా అనిశ్చితిలో పడిందని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. రికార్డుస్థాయిలో వరుసగా ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న తన ఆశయాన్ని కూడా కరోనా చిదిమేసిందని పేర్కొన్నాడు. తన కెరీర్‌కు ఈ ఏడాదే చివరిదని పేస్ గతంలోనే ప్రకటించాడు. ఇప్పటివరకు 97 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన పేస్ మరో మూడింటిలో పాల్గొంటే 100 గ్రాండ్‌స్లామ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే కరోనాతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల నిర్వహణపై అనిశ్చితితోపాటు ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన ఆశలు నెరవేరేలా లేవన్నాడు.
‘100 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ప్రాతినిధ్యం, ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో ఆడిన టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించడం నా ముందున్న లక్ష్యాలు. వాటిని సాధించాలని పట్టుదలతో ఉన్నా. ఒకవేళ అందుకోలేకపోయినా... ఇప్పటివరకు సాధించిన వాటిపట్ల సంతృప్తిగానే ఉంటా. లాక్‌డౌన్ ఎత్తేశాక 2021లో కూడా ఆడాలా? వద్దా? అనేది నా టీమ్‌తో కలిసి నిర్ణయం తీసుకుంటా’ అని పేస్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment