ఈసారి ఇవనోవిచ్, క్విటోవా... | Nadal Beats Mayer as Ivanovic, Kvitova Exit French Open Tennis | Sakshi
Sakshi News home page

ఈసారి ఇవనోవిచ్, క్విటోవా...

Published Sun, Jun 1 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

ఈసారి ఇవనోవిచ్, క్విటోవా...

ఈసారి ఇవనోవిచ్, క్విటోవా...

మూడో రౌండ్‌లోనే ఓడిన మాజీ విజేత, ఐదో సీడ్  
 సఫరోవా, కుజ్‌నెత్సోవా అద్భుత విజయాలు   
 ఫ్రెంచ్ ఓపెన్
 
 పారిస్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఏ ముహూర్తాన ప్రారంభమైందోగాని మహిళల విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులకు ఏమాత్రం కలిసిరావడంలేదు. తొలి రోజు మొదలైన అగ్రశ్రేణి క్రీడాకారిణుల పరాజయాల పర్వం శనివారం కూడా కొనసాగింది. ఇప్పటికే టాప్ సీడ్ సెరెనా (అమెరికా), రెండో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) ఇంటిదారి పట్టగా... తాజాగా వీరి సరసన ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్, 2008 చాంపియన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) చేరారు.
 
 శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... హోరాహోరీ పోరులో 2009 చాంపియన్, 27వ సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 6-7 (3/7), 6-1, 9-7తో క్విటోవాపై అద్భుత విజయం సాధించింది. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్టే 92 నిమిషాలు జరగడం విశేషం. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన తర్వాత స్వెత్లానా మరో 17 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడినా ఏ దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో స్వెత్లానా నాలుగు ఏస్‌లు సంధించగా... నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, కేవలం 20 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2011 వింబుల్డన్ చాంపియన్ క్విటోవా 11 డబుల్ ఫాల్ట్‌లు, 65 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
 
 సిమోనా, జంకోవిచ్ ముందంజ
 మహిళల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 6-0తో మరియా తెరెసా (స్పెయిన్)పై, ఆరో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2తో 26వ సీడ్ సొరానా కిర్‌స్టీ (రుమేనియా)పై, 10వ సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-0, 6-1తో గ్లుష్‌కో (ఇజ్రాయెల్)పై, 15వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6-3, 6-4తో 22వ సీడ్ మకరోవా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
 
 నాదల్, ఫెరర్ జోరు
 పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్‌లో నాదల్ 6-2, 7-5, 6-2తో మాయర్ (అర్జెంటీనా)పై, ఫెరర్ 6-2, 7-6 (7/2), 6-3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై గెలిచారు. 23వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 5-7, 6-2, 6-4, 0-6, 6-2తో 14వ సీడ్ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)ను బోల్తా కొట్టించాడు.
 
 ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి
 మహిళల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ జంట 6-1, 6-2తో డబ్రోవ్‌స్కీ (కెనడా)-రొసోల్‌స్కా (పోలండ్) ద్వయంపై గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో జంకోవిచ్ (సెర్బియా)-క్లెబనోవా (రష్యా) జోడితో సానియా జంట తలపడుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement