
నరైన్‌ను పరీక్షించాల్సిందే
సందేహాస్పద బౌలింగ్ శైలి నుంచి ఐసీసీ విముక్తి కల్పించినా... కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ మరోసారి పరీక్షకు హాజరు కావల్సిందేనని బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా స్పష్టం చేశారు.
స్పష్టం చేసిన దాల్మియా
కోల్‌కతా: సందేహాస్పద బౌలింగ్ శైలి నుంచి ఐసీసీ విముక్తి కల్పించినా... కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ మరోసారి పరీక్షకు హాజరు కావల్సిందేనని బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే కేకేఆర్ యాజమాన్యంతో మాట్లాడారు. ఒకటికి రెండుసార్లు పరీక్షించి లీగ్‌లో ఆడిస్తే తర్వాత ఎలాంటి వివాదాలు తలెత్తవని దాల్మియా అభిప్రాయపడ్డారు. చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీలోనే నరైన్‌కు బయోమెకానికల్ పరీక్ష జరుగుతుందని దాల్మియా కార్యాలయం వెల్లడించింది.
2014 చాంపియన్స్ లీగ్ సందర్భంగా నరైన్ బౌలింగ్ సందేహాస్పదంగా ఉందని బీసీసీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత నరైన్ తన ైశైలి మార్చుకుని ఐసీసీ నిర్వహించిన పరీక్షలో పాసయ్యాడు. కానీ... కొత్త శైలికి అలవాటు పడేం దుకు సమయం కావాలంటూ వెస్టిండీస్ తరఫున ప్రపంచకప్ ఆడకుండా దూరమయ్యాడు. ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బీసీసీఐ ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదని కేకేఆర్ జట్టు అంటోంది. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది.