కరాచీ: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్ చెలరేగిపోయి బౌలింగ్ వేసింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. నసీమ్ షా దెబ్బకు లంకేయులు తమ రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యారు. చివరి మూడు వికెట్లలో రెండు వికెట్లను నసీమ్ షా సాధించడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. కాగా, ఈ క్రమంలోనే నసీమ్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ఆదివారం ఆటలో చివరి బంతికి దిల్రువాన్ పెరీరాను ఔట్ చేసిన నసీమ్.. ఈ రోజు ఆటలో తొలి బంతికే లసిత్ ఎంబల్‌దెనియాను పెవిలియన్‌కు పంపాడు. దాంతో హ్యాట్రిక్ సాధించే అవకాశం నసీమ్‌కు వచ్చింది. కాగా, దాన్ని సాధించడంలో నసీమ్ విఫలమైనప్పటికీ, మరొక ఓవర్‌లో విశ్వ ఫెర్నాండో ఔట్ చేసి ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌ను 555/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. షాన్ మసూద్, అబిద్ అలీ, అజహర్ అలీ, బాబర్ అజామ్‌లు సెంచరీలతో మెరిశారు. ఇక శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment