నాసిర్ జంషెడ్ (ఫైల్ ఫొటో)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ నాసిర్ జంషేడ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అతను పీసీబీ అవినీతి నిరోధక శాఖ కోడ్ అతిక్రమించినట్లు గుర్తించి చర్యలు తీసుకుంది. నాసిర్ ఏ స్థాయి క్రికెట్ ఆడటానికి వీళ్లేదని శుక్రవారం ముగ్గురు సభ్యుల స్వతంత్ర అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ప్రకటించింది. ఇక బోర్డ్ కోడ్ ఉల్లంఘించిన క్రికెటర్లు పీసీబీలో ఏలాంటి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉండదు.
గత రెండేళ్లలో నాసిర్‌పై పీసీబీ రెండోసారి శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్‌లో అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది. 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో నాసిర్ స్పాట్ ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణల్లో భాగంగా విచారణకు సహకరించనందుకు ఏడాది పాటు నిషేధం విధిస్తూ పీసీబీ చర్యలు తీసుకుంది. ఈ కేసులో బ్రిటన్ పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేశారు. పాకిస్తాన్ తరపున 48 వన్డేలు ఆడిన నాసిర్ 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1418 పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన నాసిర్ 18 టీ20లు, రెండు టెస్టులకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment