
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్లు నవనీత్ బొక్కా, సాహితి బండి సత్తా చాటారు. విజయవాడలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జంటగా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన అండర్–19 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ నవనీత్–సాహితి (తెలంగాణ) ద్వయం 21–19, 21–11తో టాప్ సీడ్ ఎడ్విన్ జాయ్–నఫీసా సారా సిరాజ్ (కేరళ) జోడీపై కేవలం 24 నిమిషాల్లోనే విజయం సాధించింది. బాలుర విభాగంలో ఏపీ ప్లేయర్ సాయి చరణ్ కోయకు నిరాశ ఎదురైంది.
బాలుర సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ సాయి చరణ్ 21–14, 22–24, 21–14తో టాప్ సీడ్ మైస్నమ్ మీరాబా (మణిపూర్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. బాలికల సింగిల్స్ విభాగంలో స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర), బాలుర డబుల్స్ విభాగంలో యశ్ రైక్వార్–ఇమాన్ సోనోవాల్ జంట, బాలికల డబుల్స్ కేటగిరీలో టాప్‌సీడ్ త్రెసా జోలీ–వర్షిణి (తమిళనాడు) జంట టైటిళ్లను గెలుచుకున్నారు.