మాంచెస్టర్: భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల సమరం అంటే ఎంత మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌లు తలపడుతున్నాయంటే ఆ హీట్ మరింత పెరుగుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తుంటే ఆయా దేశాల మాజీలు మాత్రం విలువైన సూచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా భారత్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొన్ని సలహాలు ఇచ్చాడు.
‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు నెగటివ్ మైండ్‌సెట్‌ను విడిచిపెట్టండి. ప్రధానంగా పాక్ ప్రధాన పేస్ ఆయుధం మహ్మద్ ఆమిర్ బౌలింగ్ ఎదుర్కొనేటప్పుడు ఆత్మవిశ్వాసం అవసరం. ప్రతీ ఒక్క బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనుకాకుండా సహజ సిద్ధమైన బ్యాటింగ్‌నే అనుసరించండి. ఇక్కడ భిన్నంగా చేయాల్సింది ఏమీ లేదు. మీ బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యమైనది. మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే అంత నిలకడైన ఆటను ప్రదర్శించవచ్చు. ఆమిర్ బౌలింగ్‌ను అత్యంత రక్షణాత్మక ధోరణిలో ఆడకండి. అతని బౌలింగ్‌లో ఆత్మ విశ్వాసంతో కూడిన దూకుడు అవసరం’ అని సచిన్ తెలిపాడు.
భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎక్కువగా టార్గెట్ చేసేది విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలనేనని సచిన్ స్పష్టం చేశాడు. వీరిద్దరూ భారత జట్టు కీలక ఆటగాళ్లు కావడమే కాకుండా అనుభవం ఉన్న క్రికెటర్లు కావడంతో వారే లక్ష్యంగా పాకిస్తాన్ పోరుకు సిద్ధమవుతుందన్నాడు. రోహిత్, కోహ్లిలను తొందరగా పెవిలియన్‌కు పంపడమే లక్ష్యంగా ఆమిర్, వహాబ్ రియాజ్‌లు తమ పేస్‌కు పదును పెడతారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. రోహిత్-కోహ్లిలు సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉంటే పాక్‌పై పైచేయి సాధించడం సునాయాసమవుతుందని సచిన్ సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment