టైటిల్‌కు విజయం దూరంలో | Nehwal got past Nozomi Okuhara to reach final | Sakshi
Sakshi News home page

టైటిల్‌కు విజయం దూరంలో

Published Sun, Oct 21 2018 12:53 AM | Last Updated on Sun, Oct 21 2018 12:53 AM

 Nehwal got past Nozomi Okuhara to reach final - Sakshi

ఓడెన్స్‌: ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ మరో విజయం దూరంలో నిలిచింది. డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్‌ సైనా 21–11, 21–12తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సైనా ఆడుతుంది. గ్రెగోరియాతో కేవలం 30 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌ నుంచి కాబోయే భర్త పారుపల్లి కశ్యప్, కోచ్‌ సియాదత్‌ కోర్టు పక్కనే ఉంటూ సైనాకు సలహాలు ఇస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆలస్యంగా ముగిసిన క్వార్టర్‌ ఫైనల్లో సైనా 17–21, 21–16, 21–12తో ప్రపంచ మాజీ చాంపియన్, ఏడో ర్యాంకర్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై విజయం సాధించింది.  

తై జు యింగ్‌పై నెగ్గేనా... 
2012లో ఈ టోర్నీ టైటిల్‌ గెలిచిన సైనా ఈసారి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లను కాచుకొని గెలిచిన సైనా ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌)పై, ఎనిమిదో సీడ్‌ ఒకుహారాపై గెలిచింది. అయితే ఫైనల్లో తై జు యింగ్‌ రూపంలో సైనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. కొన్నేళ్లుగా కొరకరాని కొయ్యగా మారిన తై జు యింగ్‌పై గెలిచి సైనాకు ఐదేళ్లు దాటింది. ఇప్పటివరకు వీరిద్దరు 17 సార్లు తలపడగా... తై జు యింగ్‌ 12 మ్యాచ్‌ల్లో... సైనా 5 మ్యాచ్‌ల్లో గెలిచారు. 2013 స్విస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో తై జు యింగ్‌పై గెలిచిన తర్వాత ఆమెతో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో సైనాకు ఓటమే ఎదురైంది. ఈ ఏడాది ఈ చైనీస్‌ తైపీ షట్లర్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సైనాకు చుక్కెదురైంది. ఈ టోర్నీలో నిలకడగా ఆడుతోన్న సైనా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి తై జు యింగ్‌ ఆట కట్టిస్తుందో లేదో వేచి చూడాలి. 

శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ... 
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌ (భారత్‌)కు నిరాశ ఎదురైంది. ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో జరిగిన సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 16–21, 12–21తో ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement