
‘ఎత్తు’తో చిత్తు చేశారు
సెమీస్‌లోకి నెదర్లాండ్స్
షూటౌట్‌లో కోస్టారికాపై 4-3తో గెలుపు
ఫలించిన కోచ్ వాన్ గాల్ వ్యూహం
‘హీరో’ అయిన సబ్‌స్టిట్యూట్
గోల్‌కీపర్ క్రూల్
సెమీస్‌లో ఎవరితో ఎవరు
8న బ్రెజిల్ x జర్మనీ రాత్రి.గం 1.30
9న నెదర్లాండ్స్ x అర్జెంటీనా రాత్రి.గం 1.30
రెండు అంగుళాలు... మామూలుగా ఎత్తు విషయంలో ఇది పెద్ద లెక్కేం కాదు. కానీ అదే రెండు అంగుళాలు ఒక దేశాన్ని ప్రపంచకప్ సెమీస్‌కు చేర్చాయి. ఓ కోచ్ సునిశిత దృష్టి... కోట్లాది మంది ఆశలను నిలబెట్టింది.
అవును... నెదర్లాండ్స్‌ను ప్రపంచకప్ సెమీస్‌కు చేర్చింది ఆ రెండు అంగుళాలే. 120 నిమిషాల పాటు ఆడిన తమ ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్‌ను నెదర్లాండ్స్ ఆఖరి క్షణాల్లో తప్పించింది. పెనాల్టీ షూటౌట్ కోసం రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను తీసుకొచ్చింది. ఫుట్‌బాల్‌ను బాగా చూసేవాళ్లు కూడా ఈ వ్యూహం అర్థం కాక దిమ్మెరపోయారు.
కానీ ఈ ‘ఎత్తు’ వేసిన కోచ్ వాన్ గాల్ ఆలోచన మరోలా ఉంది. ప్రధాన గోల్ కీపర్ ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు. రెండో గోల్ కీపర్ క్రూల్ ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు. పెనాల్టీలను అడ్డుకోవాలంటే రెండు అంగుళాలైనా ఎత్తు.. ఎత్తే అనుకున్నారేమో... ఈ ‘కొత్త ఎత్తు’ వేశారు. ఆ ప్లాన్ ఫలించింది. టిమ్ క్రూల్ ఏకంగా రెండుసార్లు కోస్టారికా గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నెదర్లాండ్స్‌ను సెమీస్‌కు చేర్చి 15 నిమిషాల్లోనే హీరోగా మారాడు. అటు తన ప్లాన్‌తో వాన్ గాల్ ‘వహ్వా’ అనిపించుకున్నారు.
సాల్వెడార్: పాపం... కోస్టారికా. టోర్నీ ఆద్యంతం అంచనాలకు అందని రీతిలో ఆడి క్వార్టర్స్‌కు చేరింది. ఇక్కడా అత్యంత పటిష్టమైన నెదర్లాండ్స్ జట్టును వణికించింది. అయితే పెనాల్టీ షూటౌట్‌లో మాత్రం అదృష్టం వెక్కిరించింది. అంతకుముందు నిర్ణీత, అదనపు సమయంలో ఏకంగా 15 గోల్స్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నా... చిట్ట చివర్లో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ వ్యూహాలకు కోస్టారికా దెబ్బతింది.
అత్యంత నాటకీయ పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ టిమ్ క్రూల్ షూటౌట్‌కు బరిలోకి దిగడమే కాకుండా సూపర్ సేవర్‌గా మారి తమ జట్టును గట్టెక్కించాడు. ఫలితంగా శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ హోరాహోరీ పోరులో నెదర్లాండ్స్ 4-3తో నెగ్గింది. అదనపు సమయం దాకా ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా రాలేదు. ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గడం ఇదే తొలిసారి. ఆ జట్టు తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ (7) చేసిన రెప్ రికార్డును రాబెన్, స్నైడర్ సమం చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం కోస్టారికా కీపర్ నవాస్‌కు దక్కింది.
తొలి నిమిషం నుంచే నెదర్లాండ్స్... కోస్టారికా గోల్ పోస్టుపై దాడులకు దిగింది. అయితే వీటిని కీపర్ నవాస్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు.
39వ నిమిషంలో స్ట్రయికర్ రాబెన్ షాట్‌ను తక్కువ ఎత్తులో కుడి వైపు డైవ్ చేస్తూ నవాస్ బయటకు పంపాడు.
ఇంజ్యూరీ సమయం (90+4)లో గోల్ పోస్టుకు కుడివైపు ఉన్న కుయుట్ బంతిని నెట్‌లోకి పంపినా గోల్ లైన్‌పై నిలుచున్న మిడ్ ఫీల్డర్ టెజెడా మెరుపు వేగంతో దాన్ని బయటికి తన్నడంతో తృటిలో గోల్ అవకాశం చేజారింది.
82, 117వ నిమిషంలోనూ స్నైడర్ కొట్టిన ఫ్రీ కిక్‌లు గోల్ పోస్టు బార్‌కు తగిలి విఫలమయ్యాయి.
ఎక్‌స్ట్రా సమయం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ కోచ్ తమ రెగ్యులర్ కీపర్‌ను మార్చాడు.