గయానా : టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి వార్తల్లో నిచిచారు. ధనా ధన్ షాట్లతో బంతిని బౌండరీలకు తరలించడమే కాదు, సమయస్పూర్తితో వ్యవరించి అభిమానుల హృదయాలను కౌర్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లోనే హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల టీ20 క్రికెట్‌లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కూడా హర్మన్‌ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు జాతీయగీతం ఆలపించే సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇరు జట్లు జాతీయ గీతం పాడడానికి మైదానంలో నిల్చున్న సమయంలో ఎప్పటిలానే ఒక్కోక్కరి ముందు ఒక్కో చిన్నారి నిల్చున్నారు. చిన్నారులందరూ టీ20 ప్రపంచకప్ మస్కట్ ఉన్న టీషర్టులు ధరించి అక్కడ నిల్చున్నారు. అయితే సరిగ్గా భారత జాతీయ గీతం ప్రారంభమయ్యే సమయంలో తన ముందు నిల్చున్న చిన్నారి అనారోగ్యానికి గురవ్వడాన్ని హర్మన్ ప్రీత్ కౌర్ గమనించింది. జాతీయగీతం అయిపోయేంత వరకు సదరు చిన్నారిని చేతితో పట్టుకుంది. జాతీయ గీతాలాపన పూర్తయిన వెంటనే చేతులతో చిన్నారిని ఎత్తుకుని వెంటనే తీసుకెళ్లి మేనేజ్‌మెంట్ వాళ్లకి అప్పగించింది. ఓ వైపు జాతీయ గీతాన్ని ఆలకిస్తూనే, మరోవైపు చిన్నారిని కిందపడకుండా హర్మన్ సమయస్పూర్తితో వ్యవహరించారని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు వరుసగా రెండో విజయం నమోదు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు), నిదా దార్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/22), హేమలత (2/34) ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకుగాను పెనాల్టీగా అంపైర్లు భారత జట్టుకు 10 పరుగులు అదనంగా కేటాయించారు. లక్ష్య ఛేదనలో మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు), స్మృతి మంధాన (26; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగడంతో భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసి గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment