మార్టిన్ క్రో మరిలేరు | New Zealand cricket great Martin Crowe dies aged 53 | Sakshi
Sakshi News home page

మార్టిన్ క్రో మరిలేరు

Published Thu, Mar 3 2016 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

మార్టిన్ క్రో మరిలేరు

మార్టిన్ క్రో మరిలేరు

 జననం: సెప్టెంబర్ 22, 1962   మరణం: మార్చి 3, 2016

లింఫోమా వ్యాధితో మరణించిన
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
53 ఏళ్లకే కన్నుమూసిన దిగ్గజం

 
ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మార్టిన్ క్రో కన్ను మూశారు. గత నాలుగేళ్లుగా ఆయన ప్రమాదకరమైన లింఫోమా (ఒక రకమైన క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. క్రో వయసు 53 ఏళ్లు. ‘కుటుంబ సభ్యుల మధ్య మార్టిన్ క్రో గురువారం తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త చెప్పడానికి చింతిస్తున్నాం’ అని ఆయన సన్నిహితులు ప్రకటించారు. మార్టిన్‌కు భార్య లోరిన్, కుమార్తె ఎమ్మాతో పాటు మరో ఇద్దరు సవతి పిల్లలు (లోరిన్ పిల్లలు) ఉన్నారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన క్రో... కొద్ది రోజుల తర్వాత వెటోరి రిటైర్మెంట్ సందర్భంగా ఆఖరి సారిగా బయట కనిపించారు. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. మార్చి 10న క్రో అంత్యక్రియలు జరుగుతాయి.


న్యూజిలాండ్ తరఫున ఉత్తమం
13 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు (17) ఇంకా కొనసాగుతోంది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు. ఎవరూ ఊహించని విధంగా క్రో మార్గదర్శనంతో కివీస్ లీగ్‌లో టాప్‌గా నిలిచి సెమీస్ వరకు చేరడం ఒక సంచలనం.

కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, రచయితగా, వేర్వేరు జట్లకు మెంటార్‌గా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. ‘క్రికెట్ మ్యాక్స్’ పేరుతో మార్టిన్ క్రో తొలిసారి కొత్త తరహాలో నిర్వహించిన క్రికెట్ వల్లే టి20ల ఆలోచన వచ్చింది. 2011లో 48 ఏళ్ల వయసులో క్లబ్ క్రికెట్ ఆడిన క్రో పునరాగమనం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది.  
 
 క్రికెట్ ప్రపంచం నివాళి
నాతో పాటు ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చారు. మా దేశానికి నిజమైన దిగ్గజం  - స్టీఫెన్ ఫ్లెమింగ్
 
క్రో కుటుంబం, అభిమానులకు నా సంతాపం. చివరి వరకు పోరాడిన గొప్ప క్రికెటర్  - సచిన్ టెండూల్కర్
 
న్యూజిలాండ్ తరఫునే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు - ఐసీసీ సీఈ రిచర్డ్సన్
 
 టెస్టుల్లో మార్టిన్ క్రో అత్యధిక స్కోరు 299. వెల్లింగ్టన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. ఐదో రోజు ఆఖరి ఓవర్ మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. ప్రపంచ క్రికెట్‌లో 299 పరుగుల వద్ద అవుటైన ఏకైక బ్యాట్స్‌మన్ క్రో. 23 ఏళ్ల పాటు కివీస్ తరఫున ఇదే అత్యధిక స్కోరు. ‘ఎవరెస్ట్‌ను దాదాపుగా ఎక్కేసి కాలు పట్టేయడంతో ఆఖరి అడుగు వేయలేనివాడిగా నా పరిస్థితి కనిపించింది’ అని మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి క్రో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement