Lymphoma disease
-
లింఫోమా అంటే ఏంటి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
Lymphoma disease Precautions: లింఫోమా అనేది రక్త సంబంధిత క్యాన్సర్లలో ఒకటి. తెల్ల రక్తకణాల్లో ఒక రకం కణాలైన లింఫోసైట్స్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, ఆ తర్వాత వాటిని తరలించుకు వెళ్లే కణజాలాల్లో వచ్చే క్యాన్సర్ ఇది. దీనిలో ప్రాథమికంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్–హాడ్జ్కిన్స్ లింఫోమా. లక్షణాలు : ∙మెడలో, చంకలో, గజ్జల్లో వాపు వస్తుంది. ఆ వాపు నొప్పి లేకుండానే వస్తుంటుంది. ►ప్లీహం (స్ప్లీన్) పెరుగుతుంది. పొట్టలో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉంటుంది. ►జ్వరంతో చలిగా అనిపించడం లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం, విపరీతమైన నిస్సత్తువ కనిపిస్తుంది. నిర్ధారణ పరీక్షలు : ∙రక్త పరీక్షలు ∙బయాప్సీ ∙ఎముక మూలుగ పరీక్ష ∙సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్స్ పరీక్ష ∙మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ∙ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు చేయించాలి. వాటిని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించి, లింఫోమా ఉందా, ఉంటే అది ఏ దశలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు. చికిత్స : ఒకసారి లింఫోమా ఉందని నిర్ధారణ అయ్యాక ఎలాంటి చికిత్స అందించాలన్న విషయం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ►బాధితుడికి ఉన్నది ఏ రకమైన లింఫోమా ∙దాని దశ (అంటే... లింఫోమా కారణంగా ఏయే అవయవాలు ప్రభావితమయ్యాయి) ∙బాధితుడి సాధారణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది... అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. లింఫోమా తర్వాత... చికిత్స తీసుకుంటూనే బాధితులు కొన్ని జాగ్రత్తలతో వ్యాధి అనంతర జీవితాన్ని సాధ్యమైనంత ఆరోగ్యంగానే జీవించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ►పుష్టికరమైన సమతులాహారం తీసుకోవాలి. అయితే అది ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా... సాధ్యమైనంత తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువసార్లు తింటుండాలి. నోట్లో పుండులాంటిది ఏదైనా ఉంటే దాన్ని గాయపరచని రీతిలో మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలనూ, బత్తాయిరసాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. అయితే మిగతా ద్రవాహారాలను పుష్కలంగా తీసుకోవడమే మంచిది. డాక్టర్ సలహా మేరకు తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలతో పాటు, శరీరానికి శ్రమ కలగని రీతిలో కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ∙తగినంత విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి పీల్చాలి. ∙కుంగుబాటు (డిప్రెషన్)ను దరిచేరనివ్వకూడదు ఒకవేళ డిప్రెషన్‌తో బాధపడుతుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకసారి లింఫోమా ఉందని తేలాక బాధితులు ఆపైన... లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అవి మాత్రమే కాదు... డాక్టర్ సూచన మేరకు మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. -
‘కివీ’ని ఎగిరించిన కెప్టెన్!
క్రికెట్ మైదానంలో భీకర బౌలర్లను ఎదుర్కొని ఎన్నో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడిన ఆ దిగ్గజం జీవన పోరాటంలో మాత్రం ఓడిపోయారు. చావు ఖాయమని, అది ముంచుకొస్తోందని తెలిసినప్పుడు మిగిలిన రోజులు బతకడం కూడా ఒక పోరాటంగా భావించిన ఆయన చివరకు తన ‘పాత స్నేహితుడు’ అని చెప్పుకున్న లింఫోమా చేతుల్లోనే తనువు చాలించారు. ‘మరో మ్యాచ్ చూసేందుకు నా జీవితం ఇక అనుమతించకపోవచ్చు. కానీ బతికేందుకు ఈ జ్ఞాపకాలు చాలు. రోజంతా కన్నీళ్లను మాత్రం బయటకు కనిపించనీయను’ అని గత వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అందరితో కన్నీళ్లు పెట్టించిన మార్టిన్ క్రో ఏడాది లోపే తన ‘ఆట’ను ముగించారు. కల్లమ్ చెప్పినట్లుగా న్యూజిలాండ్ క్రికెట్‌కు క్రో నిజంగా ‘ఆత్మ’లాంటి వ్యక్తి. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన మార్టిన్ క్రో కొన్నాళ్లకే తనదైన ముద్ర వేశారు. కళాత్మక బ్యాటింగ్‌తో పాటు అటాకింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం ప్రదర్శించారు. 1985లో బ్రిస్బేన్‌లో ఆసీస్ బ్యాటింగ్ కుప్పకూలిన చోట ఎనిమిది గంటల పాటు నిలిచి చేసిన అద్భుత సెంచరీ, క్రైస్ట్‌చర్చ్‌లో బ్రూస్రీడ్ ధాటికి రక్తం కారేలా దెబ్బ తగిలినా పోరాడుతూ చేసిన 137 పరుగులు, 1987లో నలుగురు విండీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగుల వరద పారించిన సిరీస్ ఆయన బ్యాటింగ్ గొప్పతనానికి కొన్ని మచ్చుతునకలు. తన కెరీర్లో కివీస్ గెలిచిన 16 మ్యాచ్‌లలో క్రో 55.40 సగటుతో పరుగులు చేయడం ఆయన విలువేమిటో చూపిస్తుంది. సొంతగడ్డపై, విదేశాల్లో... పేస్, స్పిన్ ఇలా అన్ని పిచ్‌లపై ఆయన ప్రభావం చూపించారు. కెరీర్ హైలైట్ 1992 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను క్రో నడిపించిన తీరు ఆయనను ఒక్కసారిగా సూపర్ కెప్టెన్‌ను చేసింది. క్రో అనూహ్య వ్యూహాలను ఎదుర్కోలేక ప్రత్యర్థులు చిత్తయ్యారు. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు ఉన్న బోర్డర్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే క్రో ఆలోచనలకు బాధితుడయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకునేందుకు గ్రేట్బ్యాచ్ను పించ్ హిట్టర్‌గా బరిలోకి దించి షాక్ ఇచ్చిన క్రో, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు తొలి ఓవర్ ఆఫ్‌స్పిన్నర్ దీపక్ పటేల్‌తో వేయించి మరో సంచలనానికి తెరలేపారు. ఇవి విఫల ప్రయోగంగానే మిగిలిపోకుండా కివీస్‌కు వరుస విజయాలు దక్కడం, జట్టు సెమీస్ చేరడం విశేషం. ఆ వరల్డ్ కప్‌లో 114 సగటుతో 456 పరుగులు చేసి స్వయంగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన క్రో బ్యాట్స్‌మన్‌గా కూడా తన స్థాయిని నిలబెట్టుకున్నారు. 1995లో భారత్‌లోనే క్రో తన చివరి టెస్టు, వన్డే సిరీస్ ఆడారు. నాగపూర్‌లో ఆయన ఆఖరి వన్డేలో స్టేడియం కూలి 9 మంది ప్రేక్షకులు మరణించడం తనను చాలా కాలం బాధించిందని క్రో చెప్పుకున్నారు. మార్టిన్ క్రో కెరీర్ రికార్డ్ మ్యా ప స సెం అ. సెం అ.స్కో టెస్టులు 77 5444 45.36 17 18 299 వన్డేలు 143 4704 38.55 4 34 107నాటౌట్ నోట్: మ్యా:మ్యాచ్‌లు; ప: పరుగులు; స: సగటు; సెం: సెంచరీలు; అ.సెం: అర్ధసెంచరీలు; అ.స్కో: అత్యధిక స్కోరు -
మార్టిన్ క్రో మరిలేరు
జననం: సెప్టెంబర్ 22, 1962 మరణం: మార్చి 3, 2016 ► లింఫోమా వ్యాధితో మరణించిన ► న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ► 53 ఏళ్లకే కన్నుమూసిన దిగ్గజం ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మార్టిన్ క్రో కన్ను మూశారు. గత నాలుగేళ్లుగా ఆయన ప్రమాదకరమైన లింఫోమా (ఒక రకమైన క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. క్రో వయసు 53 ఏళ్లు. ‘కుటుంబ సభ్యుల మధ్య మార్టిన్ క్రో గురువారం తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త చెప్పడానికి చింతిస్తున్నాం’ అని ఆయన సన్నిహితులు ప్రకటించారు. మార్టిన్‌కు భార్య లోరిన్, కుమార్తె ఎమ్మాతో పాటు మరో ఇద్దరు సవతి పిల్లలు (లోరిన్ పిల్లలు) ఉన్నారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన క్రో... కొద్ది రోజుల తర్వాత వెటోరి రిటైర్మెంట్ సందర్భంగా ఆఖరి సారిగా బయట కనిపించారు. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. మార్చి 10న క్రో అంత్యక్రియలు జరుగుతాయి. న్యూజిలాండ్ తరఫున ఉత్తమం 13 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు (17) ఇంకా కొనసాగుతోంది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు. ఎవరూ ఊహించని విధంగా క్రో మార్గదర్శనంతో కివీస్ లీగ్‌లో టాప్‌గా నిలిచి సెమీస్ వరకు చేరడం ఒక సంచలనం. కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, రచయితగా, వేర్వేరు జట్లకు మెంటార్‌గా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. ‘క్రికెట్ మ్యాక్స్’ పేరుతో మార్టిన్ క్రో తొలిసారి కొత్త తరహాలో నిర్వహించిన క్రికెట్ వల్లే టి20ల ఆలోచన వచ్చింది. 2011లో 48 ఏళ్ల వయసులో క్లబ్ క్రికెట్ ఆడిన క్రో పునరాగమనం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. క్రికెట్ ప్రపంచం నివాళి నాతో పాటు ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చారు. మా దేశానికి నిజమైన దిగ్గజం - స్టీఫెన్ ఫ్లెమింగ్ క్రో కుటుంబం, అభిమానులకు నా సంతాపం. చివరి వరకు పోరాడిన గొప్ప క్రికెటర్ - సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్ తరఫునే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు - ఐసీసీ సీఈ రిచర్డ్సన్ టెస్టుల్లో మార్టిన్ క్రో అత్యధిక స్కోరు 299. వెల్లింగ్టన్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. ఐదో రోజు ఆఖరి ఓవర్ మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. ప్రపంచ క్రికెట్లో 299 పరుగుల వద్ద అవుటైన ఏకైక బ్యాట్స్‌మన్ క్రో. 23 ఏళ్ల పాటు కివీస్ తరఫున ఇదే అత్యధిక స్కోరు. ‘ఎవరెస్ట్‌ను దాదాపుగా ఎక్కేసి కాలు పట్టేయడంతో ఆఖరి అడుగు వేయలేనివాడిగా నా పరిస్థితి కనిపించింది’ అని మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి క్రో వ్యాఖ్యానించారు.