‘కివీ’ని ఎగిరించిన కెప్టెన్!
క్రికెట్ మైదానంలో భీకర బౌలర్లను ఎదుర్కొని ఎన్నో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడిన ఆ దిగ్గజం జీవన పోరాటంలో మాత్రం ఓడిపోయారు. చావు ఖాయమని, అది ముంచుకొస్తోందని తెలిసినప్పుడు మిగిలిన రోజులు బతకడం కూడా ఒక పోరాటంగా భావించిన ఆయన చివరకు తన ‘పాత స్నేహితుడు’ అని చెప్పుకున్న లింఫోమా చేతుల్లోనే తనువు చాలించారు. ‘మరో మ్యాచ్ చూసేందుకు నా జీవితం ఇక అనుమతించకపోవచ్చు. కానీ బతికేందుకు ఈ జ్ఞాపకాలు చాలు. రోజంతా కన్నీళ్లను మాత్రం బయటకు కనిపించనీయను’ అని గత వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అందరితో కన్నీళ్లు పెట్టించిన మార్టిన్ క్రో ఏడాది లోపే తన ‘ఆట’ను ముగించారు.
కల్లమ్ చెప్పినట్లుగా న్యూజిలాండ్ క్రికెట్‌కు క్రో నిజంగా ‘ఆత్మ’లాంటి వ్యక్తి. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన మార్టిన్ క్రో కొన్నాళ్లకే తనదైన ముద్ర వేశారు. కళాత్మక బ్యాటింగ్‌తో పాటు అటాకింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం ప్రదర్శించారు. 1985లో బ్రిస్బేన్‌లో ఆసీస్ బ్యాటింగ్ కుప్పకూలిన చోట ఎనిమిది గంటల పాటు నిలిచి చేసిన అద్భుత సెంచరీ, క్రైస్ట్‌చర్చ్‌లో బ్రూస్‌రీడ్ ధాటికి రక్తం కారేలా దెబ్బ తగిలినా పోరాడుతూ చేసిన 137 పరుగులు, 1987లో నలుగురు విండీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగుల వరద పారించిన సిరీస్ ఆయన బ్యాటింగ్ గొప్పతనానికి కొన్ని మచ్చుతునకలు. తన కెరీర్‌లో కివీస్ గెలిచిన 16 మ్యాచ్‌లలో క్రో 55.40 సగటుతో పరుగులు చేయడం ఆయన విలువేమిటో చూపిస్తుంది. సొంతగడ్డపై, విదేశాల్లో... పేస్, స్పిన్ ఇలా అన్ని పిచ్‌లపై ఆయన ప్రభావం చూపించారు.
కెరీర్ హైలైట్
1992 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను క్రో నడిపించిన తీరు ఆయనను ఒక్కసారిగా సూపర్ కెప్టెన్‌ను చేసింది. క్రో అనూహ్య వ్యూహాలను ఎదుర్కోలేక ప్రత్యర్థులు చిత్తయ్యారు. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు ఉన్న బోర్డర్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే క్రో ఆలోచనలకు బాధితుడయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకునేందుకు గ్రేట్‌బ్యాచ్‌ను పించ్ హిట్టర్‌గా బరిలోకి దించి షాక్ ఇచ్చిన క్రో, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు తొలి ఓవర్ ఆఫ్‌స్పిన్నర్ దీపక్ పటేల్‌తో వేయించి మరో సంచలనానికి తెరలేపారు. ఇవి విఫల ప్రయోగంగానే మిగిలిపోకుండా కివీస్‌కు వరుస విజయాలు దక్కడం, జట్టు సెమీస్ చేరడం విశేషం. ఆ వరల్డ్ కప్‌లో 114 సగటుతో 456 పరుగులు చేసి స్వయంగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన క్రో బ్యాట్స్‌మన్‌గా కూడా తన స్థాయిని నిలబెట్టుకున్నారు. 1995లో భారత్‌లోనే క్రో తన చివరి టెస్టు, వన్డే సిరీస్ ఆడారు. నాగపూర్‌లో ఆయన ఆఖరి వన్డేలో స్టేడియం కూలి 9 మంది ప్రేక్షకులు మరణించడం తనను చాలా కాలం బాధించిందని క్రో చెప్పుకున్నారు.
మార్టిన్ క్రో కెరీర్ రికార్డ్
మ్యా ప స సెం అ. సెం అ.స్కో
టెస్టులు 77 5444 45.36 17 18 299
వన్డేలు 143 4704 38.55 4 34 107నాటౌట్
నోట్: మ్యా:మ్యాచ్‌లు; ప: పరుగులు; స: సగటు; సెం: సెంచరీలు;
అ.సెం: అర్ధసెంచరీలు; అ.స్కో: అత్యధిక స్కోరు