
వెల్లింగ్టన్: కోహ్లి సేనతో జాగ్రత్తగా ఉండాలంటూ న్యూజిలాండ్ ప్రజలకు ఆదేశ పోలీసులు సరదా హెచ్చరిక జారీ చేశారు. ‘మన దేశంలో పర్యటిస్తున్న టీమిండియా గత వారం నేపియర్, మౌంట్ మాంగనీలో నిర్దాక్షిణ్యంగా న్యూజిలాండ్ జట్టుపై విరుచుకుపడింది. కావున ఎవరైనా బ్యాట్ లేదా బంతితో బయటకు వెళ్లాలనుకుంటే అదనపు జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ కివీస్ పోలీసులు సరదా పోస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఇక ఆస్ట్రేలియాపై కొనసాగించిన జైత్రయాత్రనే న్యూజిలాండ్‌లోనూ టీమిండియా కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో కోహ్లిసేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోను అదరగొడుతున్న టీమిండియా సోమవారం జరగనున్న మూడో వన్డేలోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. రేపటి మ్యాచ్‌లో గెలిచి చివరి రెండు వన్డేలకు రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక పేపర్‌పై బలంగా ఉన్న కివీస్ జట్టు.. మైదానంలో తడబాటుకు గల కారణాలను అన్వేషిస్తోంది. ఎలాగైనా చివరి మూడు వన్డేల్లో మంచి ప్రదర్శన కనబర్చాలని కివీస్ ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment