అశ్విన్ అదుర్స్.. పటిష్ట స్థితిలో భారత్
కాన్పూర్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగోరోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్లు 93 పరుగులు చేసింది. కివీస్ నెగ్గాలంటే మరో 341 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 159/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లి సేన 377/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ఓవరాల్ గా కివీస్ ముందు 434 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 434 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో కివీస్ ఓపెనర్లిద్దరనీ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ ఓవర్లో తొలి బంతికి గప్టిల్ ను డకౌట్ చేసిన అశ్విన్, ఐదో బంతికి లాథమ్(2)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(25) వికెట్ తీసి రెండొందల వికెట్ వీరుల క్లబ్ లో చేరాడు. నాలుగోరోజు ఆట నిలిపివేసే సమయానికి రాంఛీ(38), సాంట్నర్(8)లు నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
అశ్విన్ అరుదైన ఫీట్
కెరీర్ లో 37వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా గుర్తింపు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టడంతో అత్యంత వేగవంతంగా రెండు వందల వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. తద్వారా పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నిస్ లిల్లీల(38 టెస్టుల్లో) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అశ్విన్ అదిగమించాడు. ఓవరాల్ గా ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ 36 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు.
అంతకు ముందు టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో జట్టు పటిష్టస్థితిలో నిలిచింది. మురళీ విజయ్(76), చటేశ్వర్ పూజారా(78), అజింక్యా రహానే(40), రోహిత్ శర్మ(68 నాటౌట్), జడేజా(50 నాటౌట్) సమిష్టిగా రాణించడంతో 377/5 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లోనూ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 9 పరుగులే చేసిన విరాట్ కోహ్లి రెండో ఇన్నింగ్స్ లో 18 రన్స్ చేశాడు. కివీస్ బౌలర్లలో సాంట్నార్, సోథీలకు చెరో రెండు వికెట్లు లభించగా, క్రెయిగ్ కు ఒక వికెట్ దక్కింది.