విరాట్ కోహ్లీ తొలిసారి ఔటయ్యాడు!
రాంచీ: టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్, పరిమిత ఓవర్ల క్రికెట్ లో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారిగా ఔటయ్యాడు. అదేంటి.. ఇప్పటివరకూ ఎన్నో మ్యాచ్ లలో పెవిలియన్ బాటపట్టాడు కదా.! ఇప్పుడు తొలిసారి ఔట్ కావడం ఏంటనేకదా అందరి సందేహం. ఇక్కడి స్డేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లీ(45) సోధీ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే లక్కీ స్డేడియం రాంచీలో ఆడిన రెండు మ్యాచులలోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
గతంలో 2012-13లో ఇంగ్లండ్ పై 77 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మరోసారి ఇదే స్డేడియంలో 2014-15లో శ్రీలంకపై కోహ్లీ అజేయ సెంచరీ(139) సాధించాడు. అయితే ఈ రెండు మ్యాచ్ లలో ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన విరాట్.. చివరివరకూ నిలిచి జట్టును గెలిపించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కివీస్ తో బుధవారం నాటి నాలుగో వన్డేలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న దశలో సోధీ బౌలింగ్ లో కీపర్ వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు.