మ్యాచ్‌తో పాటు సిరీస్‌ కూడా...  | New Zealand Won Second ODI Against India | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌తో పాటు సిరీస్‌ కూడా... 

Published Sun, Feb 9 2020 12:18 AM | Last Updated on Sun, Feb 9 2020 8:13 AM

New Zealand Won Second ODI Against India - Sakshi

సౌతీ బౌలింగ్‌లో భారత కెప్టెన్‌ కోహ్లి బౌల్డ్‌

అద్భుత రీతిలో న్యూజిలాండ్‌పై టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ వన్డే సిరీస్‌లో తలవంచింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి సిరీస్‌ను సమర్పించుకుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. కివీస్‌ జట్టు భిన్న ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో ఆధిక్యం ప్రదర్శించి ఊపిరి పీల్చుకుంది. ఛేదనలో శ్రేయస్‌ అయ్యర్, జడేజా, సైనీ చేసిన పోరాటం టీమిండియా మ్యాచ్‌ గెలిచేందుకు సరిపోలేదు.   

జట్టులోని రిజర్వ్‌ ఆటగాళ్లంతా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ ల్యూక్‌ రోంచీ బరిలోకి దిగి ఫీల్డింగ్‌ చేయడం విశేషం. రోంచీ కివీస్‌ తరఫున 2017లో చివరి మ్యాచ్‌ ఆడాడు. అయితే ఒక కోచ్‌ జట్టు సభ్యుడిగా మైదానంలోని వ్యూహాల్లో భాగం కావడం విమర్శకు దారి తీసిన మరో కోణం.

ఆక్లాండ్‌: సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఊరట దక్కింది. భారత్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగులతో గెలిచిన కివీస్‌ మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (79 బంతుల్లో 79; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రాస్‌ టేలర్‌ (74 బంతుల్లో 73 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్‌ 48.3 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (57 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), నవదీప్‌ సైనీ (49 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. 6 అడుగుల 8 అంగుళాల పొడగరి, ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన కివీస్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకుగాను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. చివరి వన్డే మంగళవారం మౌంట్‌ మాంగనీలో జరుగుతుంది.

రాణించిన ఓపెనర్లు... 
న్యూజిలాండ్‌కు మరోసారి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈసారి పరుగుల వేటలో గప్టిల్‌ ముందుండగా, నికోల్స్‌ (59 బంతుల్లో 41; 5 ఫోర్లు) సహకరించాడు. బుమ్రా వేసిన ఎనిమిదో ఓవర్లో గప్టిల్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదడం విశేషం. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి కివీస్‌ 52 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న దశలో నికోల్స్‌ను ఎల్బీగా అవుట్‌ చేసి చహల్‌ తొలి వికెట్‌ అందించాడు. నికోల్స్‌ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. మరోవైపు 15 సెకన్ల సమయం ముగిసిన తర్వాత కూడా నికోల్స్‌ను అంపైర్‌ రివ్యూకు అనుమతించడంపై కోహ్లి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం 49 బంతుల్లో గప్టిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది.

టపటపా... 
చక్కటి ఆరంభం తర్వాత కివీస్‌ బ్యాటింగ్‌ ఒక్కసారిగా తడబడింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. బ్లన్‌డెల్‌ (22)ను శార్దుల్‌ అవుట్‌ చేయడంతో పతనం మొదలైంది. ఒక దశలో 55 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 7 వికెట్లు చేజార్చుకుంది.

ఆదుకున్న టేలర్‌...
ఈ దశలో మరోసారి రాస్‌ టేలర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడగా... కైల్‌ జేమీసన్‌ (24 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 51 బంతుల్లోనే అభేద్యంగా 76 పరుగులు జోడించడంతో కివీస్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది.

అయ్యర్‌ మినహా...
 
మయాంక్‌ అగర్వాల్‌ (3) ఆరంభంలోనే వెనుదిరగ్గా, పరుగులు మొత్తం బౌండరీల రూపంలోనే చేసిన పృథ్వీ షా (19 బంతుల్లో 24; 6 ఫోర్లు)ను బౌల్డ్‌ చేసి జేమీసన్‌ కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించాడు. అయితే సౌతీ చక్కటి బంతికి కోహ్లి (15) కూడా బౌల్డ్‌ కావడంతో భారత శిబిరంలో ఆందోళన పెరిగింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ (4) అనూహ్యంగా విఫలం కాగా, కేదార్‌ జాదవ్‌ (27 బంతుల్లో 9) బంతులను వృథా చేశాడు. మరో ఎండ్‌లో అయ్యర్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పోరాటం కొనసాగించాడు. 56 బంతుల్లో అతను అర్ధ సెంచరీ సాధించాడు. అయితే అయ్యర్‌తో పాటు శార్దుల్‌ (15 బంతుల్లో 18; 3 ఫోర్లు)ను కూడా తక్కువ వ్యవధిలో పెవిలియన్‌ పంపించి కివీస్‌ పట్టు బిగించింది.

కీలక భాగస్వామ్యం... 

153/7 స్కోరుతో భారత్‌ 32వ ఓవర్లోనే ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది. ఈ దశలో జడేజా, సైనీ కలిసి గెలిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పేసర్‌ సైనీ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. గ్రాండ్‌హోమ్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అనంతరం జేమీసన్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అతను కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. 34 బంతుల్లో మరో 45 పరుగులు చేయాల్సిన స్థితిలో సైనీ బౌల్డ్‌ కావడం భారత్‌ విజయావకాశాలను దెబ్బ తీసింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 80 బంతుల్లో 76 పరుగులు జత చేశారు.

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (రనౌట్‌) 79; నికోల్స్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 41; బ్లన్‌డెల్‌ (సి) సైనీ (బి) శార్దుల్‌ 22; టేలర్‌ (నాటౌట్‌) 73; లాథమ్‌ (ఎల్బీ) (బి) జడేజా 7; నీషమ్‌ (రనౌట్‌) 3; గ్రాండ్‌హోమ్‌ (సి) అయ్యర్‌ (బి) శార్దుల్‌ 5; చాప్‌మన్‌ (సి అండ్‌ బి) చహల్‌ 1; సౌతీ (సి) సైనీ (బి) చహల్‌ 3; జేమీసన్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 273.  
వికెట్ల పతనం: 1–93; 2–142; 3–157; 4–171; 5–175; 6–185; 7–187; 8–197. బౌలింగ్‌: శార్దుల్‌ 10–1–60–2; బుమ్రా 10–0–64–0; సైనీ 10–0–48–0; చహల్‌ 10–0–58–3; జడేజా 10–0–35–1.  
భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) జేమీసన్‌ 24; మయాంక్‌ (సి) టేలర్‌ (బి) బెన్నెట్‌ 3; కోహ్లి (బి) సౌతీ 15; అయ్యర్‌ (సి) లాథమ్‌ (బి) బెన్నెట్‌ 52; రాహుల్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 4; జాదవ్‌ (సి) నికోల్స్‌ (బి) సౌతీ 9; జడేజా (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) నీషమ్‌ 55; శార్దుల్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 18; సైనీ (బి) జేమీసన్‌ 45; చహల్‌ (రనౌట్‌) 10; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్‌) 251.  
వికెట్ల పతనం: 1–21; 2–34; 3–57; 4–71; 5–96; 6–129; 7–153; 8–229; 9–251; 10–251. బౌలింగ్‌: బెన్నెట్‌ 9–0–58–2; సౌతీ 10–1–41–2; జేమీసన్‌ 10–1–42–2; గ్రాండ్‌హోమ్‌ 10–1–54–2; నీషమ్‌ 9.3–0–52–1.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement