
కోల్‌కతా: భారత్- శ్రీలంకతో మధ్య జరిగిన తొలి టెస్టులో లంక ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని మరిచారు. చివరి రోజు ఆటలో ఓటమి తప్పదని భావించిన లంక బ్యాట్స్‌మెన్స్ డ్రా కోసం డ్రామా ప్లే చేశారు. భారత బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక తొండాట ఆడారు. ఒక వైపు టపటపా వికెట్లు పడుతుండటంతో చేసేదేమి లేక ఓటమి నుంచి గట్టెక్కేందుకు క్రీజులో టైంపాస్ చేయడం మెదలుపెట్టారు. దీంతో విసుగెత్తిన భారత బౌలర్లు, కెప్టెన్ కోహ్లి లంక బ్యాట్స్‌మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైదానంలో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అంపైర్లు జోక్యంతో సద్దుమణిగింది.
ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ 352/8 స్కోరు వద్ద డిక్లేర్ ఇచ్చి లంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక భారత్ బౌలర్ల దాటికి ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 18 ఓవర్లో క్రీజులో ఉన్న నిరోషన్ డిక్‌వెల్లా, చండీమల్‌లు పదేపదే బౌలర్‌ను బంతులు వేయకుండా అడ్డుచెప్పాడు. దీంతో షమీ కోపాద్రిక్తుడయ్యాడు. చివరికి బ్యాడ్‌లైట్‌తో అంపైర్లు మ్యాచ్ త్వరగా ముగించారు. దీంతో లంక బతికి బట్టగట్టింది. కీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన లంక బ్యాట్స్‌మెన్ తీరుపై అభిమానులు, క్రికెట్ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.