
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహ్మద్ షమీ పూర్తిగా తేలిపోయాడు.
షమీ బౌలింగ్‌ను పంజాబ్ బ్యాటర్లు ఉతికారేశారు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు వంటి యువ ఆటగాళ్లు సైతం షమీ బౌలింగ్‌లో దంచి కొట్టారు. ముఖ్యంగా మార్కస్ స్టోయినిష్ అయితే షమీకి చుక్కలు చూపించాడు. పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన షమీ ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ స్టార్ పేసర్ బౌలింగ్‌లో ఆఖరి నాలుగు బంతులను మార్కస్ సిక్సర్లగా మలిచాడు. షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 72 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో అత్యంత చెత్త రికార్డును షమీ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ పేసర్ మొహిత్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన మోహిత్ శర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు ఇచ్చాడు. తాజా మ్యాచ్‌తో మొహిత్ రికార్డును షమీ(78) బ్రేక్ చేశాడు.
ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్చర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ చెత్త రికార్డు సాధించిన తొలి ఇండియన్ బౌలర్ మాత్రం షమీనే కావడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(42), ఆర్య(36), స్టోయినిష్(11 బంతుల్లో 34) తుపాన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.