
రాజ్‌కోట్: ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్ర జట్టు యువ క్రికెటర్ కె. నితీశ్ కుమార్ రెడ్డి మళ్లీ చెలరేగాడు. ఈసారి ఏకంగా ‘క్వాడ్రాపుల్’ సెంచరీ సాధించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నితీశ్ పరుగుల వరద పారించాడు. 366 బంతులు ఆడిన ఈ వైజాగ్ కుర్రాడు 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ప్రదర్శనతో బీసీసీఐ జూనియర్స్ టోర్నమెంట్‌ల చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోయల్ (451) తర్వాత నితీశ్ రెండో స్థానంలో నిలిచాడు.
ఆంధ్ర జట్టు మరో ఓపెనర్ యోగానంద (260 బంతుల్లో 217; 23 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయగా... కెప్టెన్ పి.సుబ్రమణ్యం (131 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ శతకం సాధించాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 369/0తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు 127 ఓవర్లలో 2 వికెట్లకు 801 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నాగాలాండ్ జట్టులో 10 మంది బౌలింగ్ చేయడం గమనార్హం. ఓపెనర్లు నితీశ్, యోగానంద తొలి వికెట్‌కు ఏకంగా 535 పరుగులు జోడించడం విశేషం. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2001–2002 సీజన్‌లో గోవా జట్టుపై ఆంధ్ర ఓపెనర్లు అమిత్ పాఠక్–ప్రసాద్ రెడ్డి 380 పరుగులు జత చేశారు. 745 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 50 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ 56 పరుగులకు ఆలౌటైంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ ఇంకా 695 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఆంధ్ర జట్టు విజయం లాంఛనమే అనుకోవాలి.
ఏసీఏ నజరానా రూ. 2 లక్షలు...
‘క్వాడ్రాపుల్’ సెంచరీ’ చేసిన నితీశ్ కుమార్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అభినందించింది. అతని ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ఏసీఏ అధ్యక్షుడు జీవీకే రంగరాజు రూ. 2 లక్షలు నజరానా ప్రకటించారు. ఈ సీజన్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో నితీశ్ 6 ఇన్నింగ్స్‌లు ఆడి 1,229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక క్వాడ్రాపుల్ సెంచరీ... ఒక ట్రిపుల్ సెంచరీ (తమిళనాడుపై 301)... రెండు సెంచరీలు (గోవాపై 134; కర్ణాటకపై 190)... రెండు అర్ధ సెంచరీలు (హైదరాబాద్‌పై 94; కేరళపై 69) ఉన్నాయి. బంతితోనూ ఆకట్టుకున్న నితీశ్ 18 వికెట్లు కూడా తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment