40 ఏళ్లు దాటితే లీగ్స్‌లో నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) బాధ్యతలు స్వీకరించిన జి. వివేక్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం లీగ్ మ్యాచ్‌ల నియమ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి ఈ సీజన్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది నుంచి 40 ఏళ్లు పైబడిన క్రికెటర్లను లీగ్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అనుమతించబోమని హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ స్పష్టం చేశారు. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న శేష్ నారాయణ్ హెచ్‌సీఏ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
త్వరలో అండర్–16, 19 స్థాయిలో ప్రత్యేక లీగ్‌లను నిర్వహించేందుకు నగరంలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఈ లీగ్‌ల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లోధా కమిటీ సిఫార్సుల అమలుపై చర్చించడానికి జూలై 2న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం హెచ్‌సీఏ అనుబంధ 214 సంఘాలను సమావేశానికి ఆహ్వానించి వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. ఈసారి లీగ్ మ్యాచ్‌లను బీసీసీఐ వర్గాలకు చెందిన అవినీతి నిరోధక కమిటీల ఆధ్వర్యంలో మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 26న ముంబైలో జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తాను పాల్గొనబోతున్నట్లు శేష్‌నారాయణ్ తెలిపారు.
రాయుడు మళ్లీ హైదరాబాద్‌కు...
హైదరాబాద్ నుంచి తప్పుకొని గతంలో బరోడా, విదర్భ రంజీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అంబటి తిరుపతి రాయుడు తిరిగి హైదరాబాద్ జట్టులోకి చేరాడు. ఈ లీగ్‌లో ఇండియా సిమెంట్స్ జట్టు తరఫున రాయుడు ఆడతాడు. మరోవైపు హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌ల్లో ఆధిపత్యం ప్రదర్శించే ఎస్‌బీహెచ్ జట్టు ఈ సీజన్‌లో ఎస్‌బీఐ పేరుతో బరిలోకి దిగనుంది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్‌లతో పాటు వారికి చెందిన లీగ్ జట్లు ఎన్‌స్కాన్స్, ఎంపీ కోల్ట్స్‌పై ప్రస్తుత హెచ్‌సీఏ కార్యవర్గం వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌స్కాన్స్ జట్టు సభ్యులైన తన్మయ్ అగర్వాల్, మెహదీ హసన్ ఈ సీజన్‌లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. జాన్ మనోజ్‌కు చెందిన ఎంపీ కోల్ట్స్ ఆటగాళ్లు బి. అనిరుధ్, బెంజమిన్ థామస్, కె.అక్షత్ ఈస్ట్ మారేడ్‌పల్లి సీసీ తరఫున ఆడనున్నారు.